కరోనా వైరస్ విజృంభిస్తోన్న పరిస్థితుల్లో పోలీసుల్లో కొందరికి అనుమానాలు, భయాలు పెరుగుతున్నాయి. విపరీతమైన దగ్గు, జ్వరం ఉందన్న ఆందోళనతో చాదర్‌ఘాట్ పోలీస్ కానిస్టేబుల్ నాలుగు ఆసుపత్రులకు పరుగులు పెట్టారు. కరోనా బారిన పడుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతున్నా ఒకేచోటే వీరికి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే గోషామహల్ స్టేడియంలోని వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలంటూ పోలీసులకు ఉన్నతాధికారులు కొద్దిరోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. ఎవరికైనా లక్షణాలుంటే సంబంధిత ఇన్‌స్పెక్టర్ లేదా ఎస్సైతో ధ్రువపత్రం రాయించుకుని వెళ్లాలని పేర్కొన్నారు.
35 ఏళ్ల నుంచి 55 ఏళ్లున్న వారిలో కొందరు కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్సై, ఎస్సైలు ధ్రుపపత్రాలు తీసుకుని గోషామహల్ స్టేడియంకు వెళ్తుండగా.. అక్కడ రోజూ 25 మందికే పరీక్షలు నిర్వహిస్తామని, మిగిలిన వారు వెళ్లిపోవచ్చంటూ వైద్యులు చెబుతున్నారు. ప్రతి పోలీస్ ఠాణా నుంచి నలుగురు వస్తారని అంచనా వేసుకుంటే ఆ సంఖ్య మొత్తం 250 మంది అవుతారు. వీరిలో ప్రాధాన్య క్రమంలో పరీక్షలు చేయించినా.. రోజులపాటు వేచి ఉండాల్సి ఉంటుంది. మరిన్ని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.
57మంది పోలీసులకు వైరస్
కరోనా కట్టడికి ముందుండి పోరాడుతున్న హైదరాబాద్ పోలీసుల్లో కొందరు వైరస్ బారిన పడుతున్నారు. బుధవారం సాయంత్రం వరకూ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో 57 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 70 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకితే.. హైదరాబాద్‌లోనే 80 శాతం మంది ఉండడం గమనార్హం. పాతబస్తీలో విధులు నిర్వహిస్తున్న 10 మంది పోలీసులు, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నలుగురు పోలీసులు ఈ జాబితాలో ఉన్నారు. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదిమంది పోలీస్ అధికారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా... రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఇద్దరు పోలీసులు వైరస్ బారిన పడ్డారు.
సెలవులపై ఆందోళన..
కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లలో కొందరికి కరోనా వైరస్ సోకడం, మరికొందరు కానిస్టేబుళ్లలో అనుమానిత లక్షణాలు కనిపించాయి. అనుమానిత లక్షణాలున్నవారు తప్పనిసరిగా సిక్‌లీవ్ పెట్టాలంటూ పై అధికారులు ఆదేశిస్తున్నారు. తాము వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో పనిచేస్తున్నందుకే కరోనా లక్షణాలున్నాయని, ఇతర ప్రాంతాల్లో ఉంటే యథా ప్రకారం విధులు నిర్వహించేవారమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిక్‌లీవ్ అంటే జీతంలో కోత పడుతుందని, సాధారణ సెలవులు వినియోగించుకునే వీలు కల్పించాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఈ విషయమై కొత్వాల్ అంజనీకుమార్‌ను వివరణ కోరగా సమాచారలోపంతో ఇదంతా జరిగి ఉంటుందని, ఎవరికీ జీతంలో కోత విధించబోమని తెలిపారు.