వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అంతారం గ్రామంలో భూ తగాదాలు భగ్గుమన్నాయి. మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ సమయంలో ఇచ్చిన టెనెంట్ భూమిని రైతులు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారు సాగుచేస్తున్న భూమిని కొందరు వ్యక్తులు వచ్చి ఈ భూమి తమదంటూ.. గొడవ చేసి అక్కడే ఉన్న నాలుగు ట్రాక్టర్లు, గడ్డివాములు, గుడిసెను దగ్ధం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
40 ఏళ్లనుంచి సాగు చేస్తూ తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నామని రైతులు పేర్కొన్నారు. ఈరోజు కొంత మంది వచ్చి భూమి మాదేనంటూ గొడవలు చేస్తున్నారని వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురికి నచ్చజెప్పి పంపించారు. అనంతరం కొద్ది సేపటికే గుడిసె, గడ్డివాము, ట్రాక్టర్ ను తగులబెట్టినట్లు బాధితులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.