వికారాబాద్ జిల్లాలో మొత్తం 103 మత్స్యకార సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో నాలుగు వేల మందికి వరకు సభ్యులు ఉన్నారు. జల వనరుల శాఖ ఆధ్వర్యంలో మొత్తం 1,207 చెరువులున్నాయి. వాటిలో 499 మాత్రమే చేప పిల్లల పెంపకానికి అనువైనవని అధికారులు గుర్తించారు.
కోట్‌పల్లి, జుంటుపల్లి, సర్పన్‌పల్లి తదితర పది సాగునీటి ప్రాజెక్టుల్లోనూ వదలవచ్చని నిర్ణయించారు. చెరువు లేదా సాగు నీటి ప్రాజెక్టు సామర్ధ్యంలో కనీసం 30 శాతం నీరు ఉంటేనే చేప పిల్లల్ని విడిచిపెట్టడానికి వీలుంటుంది. ఈ ప్రకారం కోట్‌పల్లి ప్రాజెక్టులో సుమారు 10 లక్షల పెద్ద సైజు చేప పిల్లల్ని వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
సైజుల వారీగా...
మొత్తంగా ప్రాజెక్టుల్లో 80 నుంచి 100 మిల్లీమీటర్ల పొడవైనవి 21 లక్షలు, చెరువుల్లో 40 నుంచి 70 మిల్లీమీటర్ల పొడవైనవి 90 లక్షలు వదలవచ్చని మత్స్యశాఖాధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 2 లక్షలకుపైగా చేప పిల్లల్ని సిద్ధం చేసే యూనిట్ అందుబాటులో ఉంది. మిగిలిన 1.08 కోట్ల చేప పిల్లల్ని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొనుగోలు చేయనున్నారు.
గతేడాది ఇలా...
జిల్లాలో గతేడాది 99 లక్షల చేప పిల్లల్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ వర్షాభావ పరిస్థితుల వల్ల కేవలం 41 లక్షలు మాత్రమే వదిలారు. సుమారు 17 లక్షల చేపలు అమ్మకానికి వచ్చాయి. వీటి బరువు 8.5 లక్షల కేజీలు ఉందని, ఫలితంగా జిల్లాలోని మత్స్యకార కుటుంబాలకు రూ.15 కోట్లకుపైగా ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రతిపాదనలు పంపించాం...
వచ్చే సీజన్‌లో పెంచేందుకు ఎన్ని చేప పిల్లలు అవసరమవుతాయో అంచనాలు తయారు చేసి నివేదికలు ప్రభుత్వానికి అందచేశాం. ధరలు నిర్ణయించిన తర్వాత టెండరు దక్కించుకున్న గుత్తేదారు చేప పిల్లలను సరఫరా చేస్తారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురిస్తే స్థానిక అవసరాలకు ఈ ఏడాది ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి చేపలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. నాణ్యమైన చేపలు, స్థానికంగానే అందుబాటులోకి వస్తాయి. మత్స్యకార సంఘాల నుంచి ఎవరెవరు ఆసక్తి చూపిస్తున్నారనే వివరాలు సేకరించాం. చెరువు స్థాయిని బట్టి పిల్లల్ని ఉచితంగా అందజేస్తాం.
- దుర్గాప్రసాద్, జిల్లా మత్స్యశాఖాధికారి.