అధికారులు, నాయకులు కుమ్మక్కై కబ్జా చేసిన భూములను వెంటనే పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. కళ్లకు గంతలు కట్టుకుని వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి వద్ద సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ ముందు నినాదాలు చేశారు. ఫ్యాక్టరీ యజమానులు తమ భూములను లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా రోజులుగా రైతులు ఉద్యమిస్తున్నా అధికారులకు కనిపించడం లేదా అని భాజపా జిల్లా కార్యదర్శి హరికృష్ణ ప్రశ్నించారు. సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని భూదాన్ భూమిని కబ్జా చేయడమే కాకుండా... రెవెన్యూ అధికారుల నోటీసులను భేఖాతరు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంలో ఉన్న ఆంతర్యమేంటని నిలదీశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న ముఖ్యమంత్రి, సొంత పార్టీ నాయకుల అండతో భూములు కబ్జాకు గురైతే కనీసం స్పందించడం లేదన్నారు.
ఫ్యాక్టరీని వెంటనే ఖాళీ చేయించి భూదాన్ భూమిని పేద ప్రజలకు పంపిణీ చేయాలని.. లేదంటే గుర్రంపోడు తరహాలో ఉద్యమిస్తామని హరికృష్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతు యాదయ్య నర్సింలు, భాజపా మండల అధ్యక్షులు ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.