రాష్ట్రంలో కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధ్వాన పరిస్థితులకు ఈ ఘటనే నిదర్శనం. ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినా.. అక్కడా రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. కొనుగోలుకు నోచుకోక.. బిల్లు చెల్లింపులు చేయక.. కార్యాలయాలు, అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది.
ఇంట్లో వారి బాధ చూడలేక.. చేసిన అప్పులు తీర్చలేక.. అధికారుల నుంచి సరైన సమాధానం లేక ఓ రైతు ఆత్మహత్యకు యత్నించబోయాడు. గమనించిన తోటి రైతులు వారించి కిందకు దింపారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం బాస్పల్లి వరి కొనుగోలు కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది.
ఇరవై రోజులు దాటినా.. తన ధాన్యానికి బిల్లు చెల్లించడం లేదంటూ రైతు కృష్ణ వాపోయాడు. అధికారుల నుంచి సరైన స్పందన లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. రోజుల తరబడి అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. బిల్లు చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆర్థిక స్థితి బాగాలేదని.. తల్లి కాలు విరిగి మంచాన పడిందని.. వేరే ఆధారం లేకే బలవన్మరణానికి యత్నించబోయానంటూ రైతు కృష్ణ వాపోయాడు.
ఇదీచూడండి: CS: 'సరిహద్దు గ్రామాల్లో నివారణ చర్యలు చేపట్టండి'