- తాండూరు మండలం ఎల్మకన్నె సహకార సంఘానికి రెండు రోజుల క్రితం ఎరువుల కోసం పెద్దఎత్తున రైతులు వచ్చారు. ఆ రోజు యూరియా ఒక్కలోడు మాత్రమే వచ్చింది. దీంతో 90 మంది రైతులకు పంపిణీ చేసి మిగతావారిని తిరిగి పంపించేశారు. సహకార సంఘం ముందు జనాభా, తొక్కిసలాటను చూసి బయటి నుంచే సగం మంది వెళ్లిపోయారు.
- పెద్దేముల్ రైతు సేవా సహకార సంఘానికి బుధవారం ఒక లారీ లోడ్ రాగానే అరగంటలోనే ఖాళీ అయ్యింది. యూరియా వచ్చినట్లు సమాచారం అందడంతో రైతులు పెద్ద సంఖ్యలో సొసైటీ వద్దకు చేరుకున్నారు. 400 బస్తాలు కేవలం వంద మంది రైతులకే సరిపోయాయి. మిగతా రైతులు సిబ్బందితో గొడవకు దిగి ఎరువులు ఇచ్చేవరకు కదలమన్నారు. దీంతో ముందుస్తుగా టోకెన్లను అందజేసి యూరియా రాగానే మీకే అందజేస్తామని పేర్కొనడంతో రైతులు వెనుదిరిగారు.
230 ఎరువుల దుకాణాలు
వికారాబాద్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 5.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా 2.53 లక్షల ఎకరాల్లో పత్తి, 1.70 లక్షల ఎకరాల్లో కంది, 68 వేల ఎకరాలోల వరి సాగు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 230 ఎరువుల దుకాణాలున్నాయి. ఆగస్టు వరకు 19వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, 14 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాకు వచ్చింది. ప్రస్తుతం 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా లోటు కనిపిస్తోంది. మోమిన్‌పేట్ మండలానికి ఇప్పటి వరకు కేవలం 230 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు, మర్పల్లిలో 655 మెట్రిక్ టన్నులు, పెద్దేముల్ మండలంలో వెయ్యి మెట్రిక్ టన్నులకు 41 మెట్రిక్ టన్నులు, బంట్వారం మండలంలో 680 మెట్రిక్ టన్నులకు కేవలం 2 టన్నులు మాత్రమే సరఫరా చేశారు. ఇలా అన్ని మండలాల్లోనూ అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమవుతోంది.
రెండు రోజుల నుంచి తిరుగుతున్నా...
రెండు రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నాను. మంగళవారం రెండు గంటలు పాటు వరుసలో తోపులాటకు తట్టుకుని నిలబడితే యూరియా అయిపోయింది బుధవారం రమ్మన్నారు. చెప్పినట్లుగానే ఉదయం 11 గంటలకు కార్యాలయానికి వెళ్లాను. ఎవరూ కనిపించలేదు. - రమేష్, బిజ్వార్, తాండూరు మండలం
గురువారం రమ్మని చీటీలు ఇచ్చారు
8 బస్తాల యూరియా అవసరం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు వరుసలో నిల్చున్నాను. నాతోపాటు ఉన్న రైతులు సొసైటీ అధికారులతో తగాదాకు దిగారు. గురువారం వస్తుందని అందరికీ చీటీలు ఇచ్చి పంపించారు. - మామిళ్ల రాములు, పెద్దేముల్
ఎవరూ తొందరపడొద్దు
రైతులు ఎరువుల కోసం తొందరపడొద్ధు జిల్లా అవసరాలకు సరిపడా యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులను సరఫరా చేస్తాం. రైతులంతా ఒక్కసారిగా రావడంతో వచ్చిన ఎరువులు ఎప్పటికప్పుడు వెళ్లిపోతున్నాయి. ఫలితంగా కొరత కనిపిస్తోంది. ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటాం.- గోపాల్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి
ఇదీ చూడండి: కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్ సూచనలు