అంతా సక్రమంగా ఉంటే ఈ సమయంలో పెద్దసంఖ్యలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరుగుతుండేవి. వాటికి పూలందించే రైతుల బతుకు లాభాలబాట పట్టేది. కరోనా మహమ్మారి.. పూల తోటల సాగుదార్లు, వాటిపై ఆధారపడి పనిచేసే పూల వ్యాపారులు, కూలీలకు ముళ్లబాట పర్చింది. లాక్‌డౌన్ వల్ల వివాహాది శుభకార్యాలు, పూజా కార్యక్రమాలన్నీ నిలిచిపోవడంతో పువ్వులను కొనేవారు లేక రైతులు వాటిని తోటల్లోనే వదిలేస్తున్నారు..
వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూరు, బెల్లంపల్లి, కోటపల్లి, లక్షెట్టిపేట తదితర మండలాల్లోని 90 ఎకరాల్లో మల్లె, 4 ఎకరాల్లో కనకాంబరం, 5 ఎకరాల్లో బంతి పూలను సాగు చేస్తుంటారు. ఫిబ్రవరి నుంచి జులై వరకు పూల తోటలు పూతకొస్తాయి.
పూతోటల్లో పెట్టుబడులు..
10 గుంటల ఖాళీ స్థలంలో మల్లెతోటను సాగు చేయాలంటే రైతుకు సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు వస్తోంది. పూత లేని ఆరు నెలల కాలంలో సుమారు 10 గుంటల తోటకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కలుపుతీత, కొమ్మల కత్తిరింపులు, గూళ్లు కట్టడం, నేల ఎరువులు, పిచికారీ మందులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఉపాధి కోల్పోయిన మహిళా కూలీలు
పూల తోటల సాగుదారులు పూలను ఎక్కడికీ రవాణా చేసే పరిస్థితి లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 1500 మంది పూలు తెంపే మహిళా కూలీలు ఉపాధి కోల్పోయారు. సుమారు 120 మంది పూల వ్యాపారం చేసే వారు కూడా జీవనోపాధిని కోల్పోయారు.
రైతులకు తీరని నష్టం..
రూ.లక్ష పెట్టుబడితో మాకున్న పెరట్లో మల్లె, గులాబీ, కాకరమల్లె పూల తోటను సాగు చేశాం. కర్ఫ్యూ వల్ల పూలు కొనే వాళ్లు లేరు. తోటల్లోనే వాటిని వదిలేశాం.
- పోషక్క, పూలతోటల సాగుదారు, బోయపల్లి
పనులు లేవు..
ఫిబ్రవరి నుంచి జులై వరకు పూల తోటల మీదే ఆధారపడే వాళ్లం. రోజూ రూ.300 వరకు వచ్చేవి. ఇప్పుడు ఆ కూలీ పని దొరకడం లేదు.
- ఎల్లవ్వ, కూలీ