భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 8వ రోజైన నేడు వికారాబాద్ సమీపంలోని డెంటల్ ఆసుపత్రి నుంచి సంజయ్ యాత్ర ప్రారంభమైంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతుబంధు పేరుతో రైతుల పథకాలు ఎత్తేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడే రైతుబంధు అమలవుతుందని అన్నారు. సన్నవడ్లు పండించాలని చెప్పి రైతులను నట్టేట ముంచిన కేసీఆర్.. అసలు రైతులెందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపా అధికారంలోకి వస్తే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
కృష్ణా నదీ జలాల పంపిణీలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో 299 టీఎంసీల నీళ్లకు అంగీకారం తెలపడం వల్లే.. నేడు గట్టిగా వాదనలు వినిపించలేక పోతున్నారని ఆరోపించారు. తన పాదయాత్రతో తెరాస వణికిపోతోందన్న సంజయ్.. భాజపాతో స్నేహం ఉందని తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీలో ప్రధానిని కలిశారని విమర్శించారు. తమకు ఏ పార్టీతోనూ మితృత్వం లేదన్నారు. కాంగ్రెస్-తెరాస మధ్యే స్నేహం ఉందని మండిపడ్డారు.
సంజయ్ యాత్రతో మార్పు ఖాయం..
అంతకుముందు రైతులతో బండి సంజయ్, ఫడణవీస్ రచ్చబండ నిర్వహించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకే సంజయ్ పాదయాత్ర చేస్తున్నారన్న ఫడణవీస్.. ఈ యాత్ర మార్పు తీసుకువస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా రైతుల వద్దకు వచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పోరాటం ప్రారంభమైందన్న ఫడణవీస్.. ఈ ప్రాంత ప్రజలు సంజయ్‌కు మద్దతుగా నిలవాలని కోరారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 575 టీఎంసీల వాటా రావాలి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కవ్వడం వల్ల కేవలం 299 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి. రాష్ట్రానికి మొదటి ద్రోహి సీఎం కేసీఆర్. రైతుబంధు పేరుతో రైతుల పథకాలన్నీ ఎత్తేశారు. భాజపా అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. బండి సంజయ్,-భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చూడండి: praja sangrama yatra: బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో దేవేంద్ర ఫడణవీస్