ద్విచక్రవాహనాన్ని అతివేగంగా నడపవద్దన్నందుకు ఓ వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుడైన నర్సింహులు గురువారం రాత్రి తన మిత్రుని ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. టీచర్స్ కాలనీ సమీపంలో ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై అధిక వేగంతో చక్కర్లు కొడుతూ నర్సింహులు వాహనానికి అడ్డుగా వచ్చారు. సదరు యువకుల్ని వాహనాన్ని అతివేగంగా నడపవద్దని వారించాడు. కోపోద్రిక్తులైన యువకులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
దాడిలో నర్సింహులు తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు నర్సింహులును సమీపంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం అతన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నర్సింహులు... స్థానికంగా యువకులు గంజాయి ఎక్కువగా సేవిస్తున్నారని.. ఇటువంటి ఘటనలు తరుచుగా జరుగుతున్నాయని తెలిపారు.
ఇవీ చూడండి: చంద్రయాన్-2 కౌంట్‌డౌన్ షురూ.. రేపే ప్రయోగం