కొవిడ్ పుణ్యమా అని పర్యాటక రంగం అతలాకుతలం అయ్యింది. కరోనాతో సహజీవనానికి ఇప్పుడిప్పుడే ప్రజలు అలవాటు పడుతున్నారు. జాగ్రత్తలు పాటిస్తే కరోనాకు దూరంగా ఉండొచ్చనే భావన ప్రజల్లోకి వచ్చింది. ఇంతకాలం ఇళ్లల్లోనే ఉన్న వారంతా చేరువలోని పర్యాటక ప్రాంతాలకు.. ఇలా వెళ్లి.. అలా వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మంది దృష్టి అనంతగిరి కొండలు, అడవులపై పడింది. ఇప్పుడు నగర ప్రజలు ‘అలా.. అనంతగిరి అడవుల్లోకి’ వెళ్లి వద్దామంటున్నారు. ఇలా వచ్చేవారికి ఆరోగ్యకరమైన వాతావరణంలో వసతితో పాటు భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ తెలిపారు.
కరోనా వేళ.. ఆరోగ్య ప్రయాణం..
అనంతగిరి అడవుల్లో ప్రాణ వాయువుకు కొదవలేదు. అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ ఆహ్లాదంగా సాగిపోతుంది. ప్రకృతి ఒడిలో అడుగులు వేసిన అనుభూతి కలుగుతుంది. కరోనా వేళ.. ఇక్కడకు వస్తే ప్రాణ వాయువు అందడంతో పాటు వ్యాయామం పూర్తవుతుంది. అందుకే అక్కడ దీర్ఘకాలిక క్షయ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందిస్తారు. వికారాబాద్‌కు 10 కిలోమీటర్లు, నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఈ కొండలు ఉన్నాయి. గుహలు, కోటలు, ఆలయాలు ఈ ప్రాంత ఔన్నత్యాన్ని చాటుతుంటే.. అడవి అందాల మధ్య 1,300 సంవత్సరాల చరిత్ర గల ‘అనంత పద్మనాభస్వామి ఆలయం’ ఆధ్యాత్మికతను పంచుతోంది. మూసీ జన్మ స్థానాన్ని ఇక్కడి అడవుల్లో చూడొచ్ఛు.
ఇక్కడ పర్యాటకాభివృద్ధి సంస్థ బస చేసేందుకు అనువైన ఏర్పాట్లు చేసింది. రెండు సూట్‌లు, 32 గదులున్నాయి. సోమవారం నుంచి గురువారం వరకూ బస చేయాలనుకుంటే రూ.1,680లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నాలుగు రోజులూ విశ్రాంతి గదులకు ఇబ్బంది ఉండదు. వారాంతం అయితే ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వారాంతాలైతే ఇదే గదికి రూ.2,576 తీసుకుంటారు. ఇందుకోసం తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్ఛు
నిండుగా కోటిపల్లి చెరువు
పక్షుల కిలకిల రావాలు.. కుందేళ్ల పరుగులు, నెమళ్ల సోయగాలు, పచ్చని పంట పొలాలతో కోటిపల్లి రిజర్వాయర్ కళకళలాడుతోంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. అనంతగిరి పర్యాటక వసతి నుంచి 20 కిలోమీటర్లు వెళ్తే కోటిపల్లి చెరువు అందాలను వీక్షించొచ్ఛు ఇక వికారాబాద్ నుంచి 10 కిలోమీటర్లు వెళ్తే.. దామగుండం వస్తుంది. ఈ పది కిలోమీటర్ల దారి ఎత్తు పల్లాలతో కొండ ప్రాంతంలో విహారం నగరవాసులకు విభిన్నంగా అనుభూతిని పంచుతుంది. ఇక్కడి రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవచ్ఛు కొలను మధ్యలో నిర్మించిన చిన్న కోవెల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇదీ చదవండిః మొక్కల పుట్టినరోజు వేడుకలు చూదము రారండి..