వికారాబాద్ జిల్లాలో కస్తుర్బా విద్యార్థిని గాయత్రి ధారూర్ అనుమాస్పదంగా మృతి చెందింది. వికారాబాద్ మండలం ఎర్రవల్లికి చెందిన గాయత్రి ధారూర్ కస్తుర్భాలో తొమ్మిదో తరగతి చదువుతోంది. శుక్రవారం రాత్రి తోటి విద్యార్థినిలతో పాటే భోజనం చేసి నిద్రించింది. శనివారం ఉదయం అందరి మాదిరిగా గాయత్రి నిద్రలేవకపోవడం వల్ల అనుమానం వచ్చిన ఆయా పాఠశాల ఉపాధ్యాయులకు సమాచారం అందించారు.
గమనించిన పాఠశాల ఎఎన్ఎం వైద్యం కోసం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
జిల్లా విద్యాశాఖాధికారి రేణుక ఆసుపత్రికి చేరుకుని విద్యార్థిని మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సిబ్బంది మాత్రం విద్యార్థిని గాయత్రి మూర్ఛ వ్యాధితో బాధపడుతోందని వెల్లడించారు.
గతంలో పాఠశాలలోనే మూర్ఛ వచ్చిందని... వైద్యం చేయించామని సిబ్బంది పేర్కొన్నారు. ప్రస్తుతం మూర్ఛ వ్యాధితోనే గాయత్రి మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతురు మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.