మోమిన్‌పేట్ మండలానికి చెందిన ఓ పంచాయతీ పరిధిలో సర్వేకు వెళ్లిన వైద్యారోగ్య సిబ్బందికి ఊహించని సమాధానాలు ఎదురయ్యాయి. ‘వాస్తవానికి మా ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా వాటిని రికార్డుల్లో రాసుకోకండి, మీతో మాకున్న సత్సంబంధాలతో అబద్ధం చెప్పలేకపోతున్నాం’. ఈ రోజు రాసుకుంటే మళ్లీ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. లక్షణాలు ఉంటే మందులు ఇస్తామని వాళ్లకు నచ్చజెబితే 10 శాతం మంది ఉన్న వాస్తవాన్ని వివరించారని చెప్పారు.
ఉత్సాహం చూపలే!
జిల్లాలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టింది. దీనికి అనూహ్య స్పందన వస్తుందనుకుంటే నామమాత్రంగానే కనిపించిందని అధికారులు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ సమస్య ఏమిటో చెబితే తగు విధంగా రాసుకుని మందులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని సిబ్బంది చెబుతున్నా ఎక్కువ మంది ఉత్సాహం చూపలేదని వివరిస్తున్నారు. ఇదే సమయంలో నిర్దేశిత గడువు కూడా తక్కువగా ఉండటంతో కొంత వెసులుబాటు కలగలేదని సమాచారం.
అంతా బాగుంది...
దాదాపు అన్ని గ్రామాల్లోనూ ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన వైద్య సిబ్బందితో వాస్తవాలను చెప్పేందుకు చొరవ చూపలేదని అధికారులు అన్నారు. ‘అందరం బాగున్నామనే’ సమాధానం వస్తుందన్నారు. జిల్లాలో దాదాపుగా 7 వేల కుటుంబాల్లో కరోనా లక్షణాలు, ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.
సుమారు 3 వేలమంది..
కరోనా తీవ్రతను, ప్రజల ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే శనివారంతో ముగిసింది. జిల్లాలో 18 మండలాలు, 566 గ్రామ పంచాయతీలు, నాలుగు పురపాలక సంఘాలు, 97 వార్డులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 1.78 లక్షలు, నాలుగు పురపాలక సంఘాల పరిధిలో 40 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆయా గ్రామాలు, వార్డుల పరిధిలో ఆశ, అంగన్వాడీ, ఏఎన్‌ఎం, ఇతర వైద్య సిబ్బంది, పంచాయతీరాజ్, పురపాలక సిబ్బంది కలిపి సుమారు 3 వేల మంది రెండు రోజుల పాటు ప్రతి ఇంటికీ వెళ్లి ఇంట్లో ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు, ఇతర కరోనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే కరోనా సంబంధిత లక్షణాలు కనిపించిన వారికి వెంటనే పరీక్షలు నిర్వహించడం, ప్రాథమిక వైద్యంలో భాగంగా మందులు అందిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల ప్రజలు ఆరోగ్య సమస్యలను తెలియజేయలేదని వైద్యారోగ్య శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రధానంగా వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణ ప్రాంతాల్లో మొత్తం 97 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో కరోనా తీవ్రత అధికంగా ఉన్నా సర్వేలో మాత్రం అన్ని కుటుంబాలు ఆరోగ్యంగానే ఉన్నామనే చెప్పారన్నారు.
భయపడకండి..
కరోనా విషయంలో ఎలాంటి భయానికి గురి కావాల్సిన అవసరం లేదని పాలనాధికారిణి పౌసుమి బసు అన్నారు. శనివారం వికారాబాద్ - ఆలంపల్లిలో నిర్వహిస్తున్న సర్వేను ఆమె పరిశీలించారు. సర్వే సిబ్బంది కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి వారికి అవసరమైన పరీక్షలు, వైద్య సేవలను అందజేస్తారని తెలిపారు. పురపాలక సంఘం అధ్యక్షురాలు మంజుల మాట్లాడుతూ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదమన్నారు.
నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాం
ఇంటింటి సర్వే పూర్తయ్యింది. వైద్య, పంచాయతీరాజ్, పురపాలక సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించారు. ఈ నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తాం. ఆపై వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాం.
- చంద్రయ్య, అదనపు కలెక్టర్
ఇవీచూడండి: గ్రామాల్లో విరుచుకుపడుతున్న కొవిడ్ వైరస్