ఇటీవల వచ్చిన వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు బ్యారేజీల్లో సమస్యలు తలెత్తాయి. మేడిగడ్డ (లక్ష్మి),అన్నారం(సరస్వతి) బ్యారేజీ దిగువన ఉన్న కాంక్రీట్ దిమ్మెలు బ్లాక్ కిందకు స్థానభ్రంశం చెందాయి. వర్షాకాలంలో వచ్చిన భారీ వర్షాలతో పాటు మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహాలు వచ్చాయి. ఈ క్రమంలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇలా వరద తాకిడికి గేట్లలో లికేజీలు, ఈప్రాన్స్, సిమెంట్ దిమ్మెలు దెబ్బతిన్నాయి.
మేడిగడ్డ బ్యారేజీ రూ.3260 కోట్ల అంచనా వ్యయంతో 16.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. బ్యారేజీ దిగువన దిమ్మెలు నీటి ప్రవాహంలో దాదాపు 100 మీటర్ల దూరం వరకు స్థానభ్రంశం చెందాయి. దిమ్మెల కింద ఏర్పాటు చేసిన మెష్‌లు పలు చోట్ల బయటపడ్డాయి. గేట్ల దిగువ భాగంలో నీరుండటంతో సిమెంట్ బ్లాకులు ఎంత మేర దెబ్బతిన్నాయే కనిపించడం లేదు. బ్యారేజీ 68, 69, 70, 71 గేట్లు మధ్యలో లీకేజీలు ఉన్నాయి.
అన్నారం బ్యారేజీ రూ.2149 కోట్ల వ్యయంతో 10.9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తి పోసిన గోదావరి జలాలు గ్రావిటీ కాలువ ద్వారా అన్నారం బ్యారేజీలోకి చేరతాయి. గత ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటిని 'అన్నారం' గేట్ల ద్వారా వదిలారు. ఆ సమయంలో బ్యారేజీ కాంక్రీటు దిమ్మెలు కిందకు జారిపోయాయి. ప్రస్తుతం బ్యారేజీ వెనుక భాగంలో దిమ్మెలు కనిపిస్తున్నాయి. బ్యారేజీలోని 55, 56 గేట్ల వద్ద లీకులున్నాయి. కరకట్టల వైపు నిర్మించిన రక్షణ గోడలకు పగుళ్లు వచ్చాయి. కొన్నిచోట్ల కూలిపోతున్నాయి.
ఇవీ చూడండి: అయేషా గోళ్లు, ఎముకలు, కేశాల పరిశీలన