కరోనా వల్ల ప్రస్తుతం ఎక్కడ చూసినా అందరూ మాస్కులు ధరించే కనిపిస్తున్నారు. మాస్కు తీసి.. ధైర్యంగా తిరిగే పరిస్థితి లేనందునా.. తప్పకపోయినా.. ముక్కు, నోరు మూసి ఉండేలా మాస్కులు ధరిస్తున్నారు. అయితే.. నిత్యం మాస్కు ధరించి ఉండాల్సి రావడం వల్ల చెవుల వెనుక భాగంలో రాపిడి జరిగి.. ఆ భాగం నొప్పిగా ఉంటోంది. చూడడానికి ఇది చిన్న ఇబ్బందే అయినా.. నొప్పి కారణంగా మాస్కు తీస్తే.. కరోనా వల్ల ప్రాణాలకే ప్రమాదం. అందుకే.. చాలామంది ఆ నొప్పిన భరిస్తూ.. కరోనాను తిట్టుకుంటూ.. మాస్కులు ధరిస్తున్నారు. అయితే.. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన లోకేష్ దీనికి చక్కటి ఉపాయం ఆలోచించాడు. చిన్నప్పుడే వినికిడి శక్తి కోల్పోయిన లోకేష్.. తను చెప్పాలనుకున్న ఐడియాను వీడియో తీసి అందరికీ తెలిసేలా ప్రయత్నిస్తున్నాడు.
ఉపాయం ఏంటంటే..
మనం ధరించే మాస్కు ఎలాస్టిక్ రెండు వైపులా చివరలు ముడి వేశాడు. దాన్ని చెవుల కిందుగా ధరిస్తూ.. చిన్న పిన్నును రెండు చివర్ల గుండా తీసి.. కళ్లెం వేశాడు. చెవికి కట్టుకోవాల్సిన అవసరం లేదు. నొప్పి పుడుతుందన్న ఇబ్బంది లేదు. లోకేష్ ఐడియా బాగుంది కదా! ఇంతకీ లోకేష్ ఏం చేస్తాడో తెలుసా.. తండ్రి వెంకటాచారితో కలిసి ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. లోకేష్ ఉపాయం నచ్చిన గుడిమల్కాపురం గ్రామస్థులంతా నీ ఉపాయం బాగుందయ్యా లోకేష్ అంటూ మెచ్చుకుంటున్నారు. మీక్కూడా ఈ ఉపాయం నచ్చితే.. ఫాలో అయిపోండి.. నొప్పికి చెక్ పెట్టండి.
ఇవీ చూడండి: సమ్మక్క-సారలమ్మలకు బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి