వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. దిల్లీలో ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా చేసిన రహదారి దిగ్బంధం ఉద్రిక్తతలకు దారి తీసింది. అఖిలపక్ష రైతు సంఘాల పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో విజయవాడ-హైదరాబాద్ 65వ నంబర్ జాతీయ రహదారిపై రైతు సంఘాల నాయకులు రాకపోకలను దిగ్బంధించారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయటంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
నిలిచిపోయిన వాహనాలు..
రైతు సంఘాల ధర్నాతో కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. సీపీఎం, సీపీఐ , న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్ నాయకులు రైతుల ఉద్యమానికి మద్దతుగా హాజరయ్యారు. నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు.
వాహనాలు భారీగా నిలిచిపోవటంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు రహదారిని దిగ్బంధించాలని రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నప్పటికీ... పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేశారు. పోలీసుల వైఖరిని తప్పుపట్టిన నాయకులు... కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: భర్త ఇంటికి పంపిన మరుసటి రోజే భార్య అనుమానస్పద మృతి!