సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ పంచాయతీలోని కర్నాల కుంట శిఖం భూమి కబ్జాలకు అడ్డాగా మారింది. సర్వే నెంబరు 328లో 7.16 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. దీనికి సమీపంలోనే నూతన కలెక్టరేట్ నిర్మాణం జరుగుతోంది. దాని పరిసరాల్లో గత మూడు నాలుగేళ్లలో పదుల సంఖ్యలో వెంచర్లు వెలిశాయి. గతేడాది కురిసిన వర్షాలకు కర్నాల కుంట నిండి వెంచర్‌లోకి నీళ్లు వెళ్లడం వల్ల తూము ద్వారా ఆ నీటిని బయటకు పంపి వెంచరు యజమాన్యం చెరువు శిఖంలోకి వెంచరు నిర్మాణాన్ని చేపట్టారు.
జాగా కనిపిస్తే పాగా వేసేస్తున్నారు
దాదాపు ఇప్పటి వరకు చెరువు ఐదెకరాలకు వరకు ఆక్రమణకు గురయినట్లు అధికారులే ప్రాథమికంగా నిర్ణయించారని అనధికార సమాచారం. ఈ ఆక్రమణ విలువ రూ.15 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆక్రమణ విషయాన్ని కొంత మంది స్థానికులు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా... చెరువు కట్టపై ఓ బోర్డును ఏర్పాటు చేశారు తప్పితే... బాధ్యులపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు.
సమగ్ర విచారణ జరపాలి
చెరువు శిఖం కబ్జా విషయం కలెక్టరు వినయ్‌కృష్ణారెడ్డి దృష్టికి రాగా చెరువు స్థలాన్ని సమగ్రంగా సర్వే చేసి హద్దులు పాతాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. అయితే ఇక్కడ ఎలాంటి ఆక్రమణలు లేవని కింది స్థాయి అధికారులు కలెక్టరుకు చెప్పినట్లు తెలిసింది. రాజకీయ, ఇతరత్రా కారణాలతో కలెక్టరు ఆదేశాలను సైతం పాటించడం లేదని సమాచారం. నూతనంగా నిర్మిస్తోన్న కలెక్టరేట్‌కు రహదారి నిర్మాణం కొరకు మట్టి తరలింపునకు రెండేళ్ల క్రితం అప్పటి కలెక్టరు రూ.60 లక్షలను మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే కలెక్టరేట్‌కు మట్టి తరలించడం అటుంచి వెంచర్‌లోకి మట్టిని తరలించి చదును చేయించారనే విమర్శలున్నాయి. దీనిపైనా సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
అందరికీ తెలిసిందే..
ఇక్కడ కొంత మంది స్థిరాస్తి వ్యాపారులు భూములను కొన్నారు. పట్టాభూమిలోనే కలెక్టరేట్‌కు ప్రభుత్వ ధర ప్రకారం 16 ఎకరాలిచ్చారు. వెంచరు కబ్జా అయిందని అందరికీ తెలుసు. -స్థానికుడు.
అధికారులు ఏమంటున్నారు
దీనిపై సూర్యాపేట కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డిని ఈనాడు - ఈటీవీ వివరణ కోరగా...చెరువు ఆక్రమణకు గురవుతుందని ఫిర్యాదులు రావడం వల్ల సమగ్ర సర్వే చేసి ఒకట్రెండు రోజుల్లో రికార్డుల్లో ఎంత విస్తీర్ణంలో చెరువు ఉందో అంత మేర హద్దులు పాతుతామని వెల్లడించారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీలో ఉచిత నీటి సరఫరా.. ప్రారంభించనున్న కేటీఆర్