నింగిలో మబ్బులను చూసి కాడి చేతబట్టే అన్నదాత... నిండు కుండలా మారిన చెరువును చూసుకుని నాట్లు వేస్తాడు. ఒకప్పుడు ఊరికే జీవధారగా ఉన్న చెరువులు భూ బకాసురు దాహానికి కరిగిపోయి కుంటల్లా మారిపోతున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లింగగిరిలో 300 ఎకరాల విస్తీర్ణానికి పైగా చెరువులు ఉండేవి. గ్రామంలో ఉన్న చిన్న చెరువు, పెద్ద చెరువు మీద ఆధారపడే వారి వ్యవసాయం సాగేది. నిండు కుండలా కలకలలాడుతూ ఉండే చెరువులు ఇప్పుడు కలను కోల్పోయి మైదానాన్ని తలపిస్తున్నాయి.
ఇవీ కారణాలు
అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు చెరువును ఆక్రమించుకొని సమీపంలో బోర్లు, బావులు తవ్వుకుని చెరువులో నీటిని కాలువలు ద్వారా బావుల్లో నింపుకుంటున్నారు. సర్వేనంబరు 569/1,569/2 లో 119 ఎకరాల విస్తీర్ణంలో ఒక చెరువు, సర్వే నంబరు 524 లో 242 ఎకరాల చెరువు ఉండేది. ప్రస్తుతం పరిశీలిస్తే అక్కడ 150 ఎకరాల విస్తీర్ణం కూడా లేదంటే ఆక్రమణ ఏ రీతిలో జరిగిందో తెలుస్తుంది.
బోర్లు వేసుకుని తోడుకుంటున్నాం
చెరువుల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఉన్న కొద్దిపాటి నీటిని రైతులు బోర్లు వేసుకుని తోడుకునే పరిస్థితి తలెత్తింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువును అభివృద్ధి చేసి... ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా రైతులు, గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఇది స్కూల్ బస్ కాదు... ఈ బస్సే స్కూల్!