cancer patient Swati charge on SI for One day : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన్నాయక్ తండాకు చెందిన ధారావత్ చాంప్ల, బూబ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు స్వాతి.. ఆమెకు చిన్నప్పటి నుంచి పోలీసు కావాలని బలమైన కోరిక ఉంది. ఆ దిశగా తన అడుగులు వేస్తూ.. ఉన్నత చదువులు చదివి మంచి పోలీసు ఆఫీసర్‌గా స్థిరపడాలని కలలు కనేది. ఇంతలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న స్వాతికి కామెర్ల వ్యాధికి గురైంది.
దాని ప్రభావంతో లివర్ చెడిపోయింది. అదికాస్తా ముదిరి ఫ్రాంకియాసిస్ క్యాన్సర్‌కు దారితీసింది. దీంతో గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో చావుబతుకుల మధ్య క్షణమొక యుగంగా గడుపుతోంది. ఇప్పటికే మూడు ఆపరేషన్లు , ఆరు దఫాలు కీమో థెరఫీ జరిపించిన ఫలితం కనిపించ లేదు. వ్యాధిని నయం చేసేందుకు తల్లిదండ్రులు ఉన్నఎకరం పొలాన్ని అమ్మి సుమారు రూ. 25 లక్షల వరకు ఖర్చు చేశారు. ఉన్న ఆస్తులు, పొలాలు అమ్ముకున్న ఆ కుటుంబం పొట్టకూటి కోసం సూర్యాపేటకు వచ్చి కూలి పనులు చేస్తున్నారు.
- గతంలో క్యాన్సర్ బారినపడ్డ చిరంజీవి?.. క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్!
- కుటుంబాన్ని మింగేసిన క్యాన్సర్ మహమ్మారి.. చనిపోయే ముందు రూ.2 కోట్ల ఆస్తిని దానం చేసిన మహిళ
Cancer patient swati story : కూతురు ఆరోగ్య పరిస్థితిని తట్టుకోలేని తండ్రి పక్షవాతానికి గురై మంచాన పడ్డారు. యుక్త వయస్సులో ఉన్న కుమార్తె క్యాన్సర్ సోకడం.. కుటుంబ పెద్దకు పక్షవాతం రావడంతో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా తయరైంది. దీంతో స్వాతికి వైద్యం అందిస్తున్న డాక్టర్లు ఆమెలో ధైర్యాన్ని నింపేందుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమెలో దాగి ఉన్న కోర్కెలను బయటకు రాబట్టగలిగారు. ఇందులో మొదటిది మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి భోజనం చేయాలని, రెండో కోర్కెగా ఒక రోజు పోలీసు అధికారిగా విధులు నిర్వహించాలని ఉందని చెప్పింది.
మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి భోజనం: ఈ విషయాన్ని వైద్యలు మంత్రి జగదీశ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి గత వారం ఆమెను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయానికి పిలిచి ఆమెతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. వారి కోసం ప్రత్యేక వంటకాలు చేయించారు. స్వాతి రెండో కోరిక పోలీసుల కావాలని ఉందని చెప్పడంతో జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌కు ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో సూర్యాపేట పోలీసులు క్యాన్సర్ బాధితురాలి కోర్కెను అమలు చేశారు. ఆమె సొంత మండలమైన చివ్వెంల స్టేషన్లో ఒక్కరోజు ఎస్ఐగా బాధ్యతలు అప్పగించారు.
"ఈరోజు చివ్వెంల పోలీసు స్టేషన్లో నేను ఎస్సైగా బాధ్యతలు స్వీకరించాను. దీంతో నా లక్ష్యం నేను అందుకున్నట్లు అయ్యింది. నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించిన మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా ఎస్పీకి ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఇచ్చే ధైర్యం నన్ను మరిన్ని రోజులు బతికిస్తుందని అనుకుంటున్నాను."- స్వాతి, క్యాన్సర్ బాధితురాలు
మొదటి కేసును పరిష్కరించిన స్వాతి: బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ స్వాతి ఆస్థి తగాదాల్లో తన సోదరులు మోసం చేశారంటూ వట్టి ఖమ్మం పహాడ్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదును స్వీకరించారు. పోలీస్ వాహనంలో తన సొంత తండాకు ఎస్ఐగా వెళ్లి తండా వాసులో ఆశ్చర్యాన్ని నింపింది. స్వాతి కళ్లలో ఆనందాన్ని చూసిన పోలీసులు ఎంతో సంతోషించారు. చావు బతుకులతో పోరాడుతున్న తనను మంత్రి, జిల్లా పోలీసులు ఎంతో ధైర్యం నింపారని స్వాతి కృతజ్ఞతలు తెలిపింది. బాధితురాలి కోర్కెలను అమలు చేసిన ప్రజా ప్రతినిధులు, పోలీసుల తీరుపై స్థానికుల నుంచి హర్షాతిరేకాలు వినిపిస్తున్నాయి. స్వాతి మంచి ఆరోగ్యంతో క్యాన్సర్‌ను జయించి తిరిగి పోలీస్ ఉద్యోగం సాధించాలని సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: