సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలోని పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారి విగ్రహం అపహరణకు గురైంది. సోమవారం రాత్రి విద్యుత్ దీపాలు ఆర్పేసి గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని దొంగిలించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈరోజు ఉదయం గుడి ముందు ఆడుకుంటున్న పిల్లలు గుడి తెరిచి ఉండటం, విగ్రహం లేకపోవడం చూసి గ్రామస్థులకు సమాచారమిచ్చినట్టు పేర్కొన్నారు.
అమ్మవారి విగ్రహం అదృశ్యమైనట్టు గమనించిన ఆలయ ఛైర్మన్ పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామస్థులంతా బృందాలుగా ఏర్పడి గుడి పరిసరాల్లో వెతకడం ప్రారంభించారు. వెతకడం మొదలుపెట్టిన కొద్దిసేపటికే దేవాలయం సమీపంలోని రోడ్డు పక్కన విగ్రహం పడి ఉండడం గమనించారు. అప్పటికే ఆలయం దగ్గరకు పోలీసులు చేరుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు గ్రామస్థులకు సూచించారు.
ఇదీ చూడండి: రైతు రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలు విడుదల