ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ నెల 2 నుంచి పది రోజుల్లోనే 36కు చేరుకుంది. మర్కజ్ వెళ్లొచ్చిన వారి నుంచే వైరస్ వ్యాప్తి చెందింది. నల్గొండ జిల్లాలో 16 కేసులు నమోదు కాగా... నల్గొండ పట్టణంలో 13, దామరచర్లలో 2, మిర్యాలగూడలో ఒకరు వైరస్ బారిన పడ్డారు. నల్గొండ మీర్‌బాగ్‌కాలనీ, బర్కత్‌పుర, రహమత్ నగర్, మాన్యంచెల్క... మిర్యాలగూడలోని సీతారాంపురం, దామరచర్లలోని పోస్టాఫీసు బజారు వీధులు రెడ్ అలర్ట్ జోన్లుగా కొనసాగుతున్నాయి. అనుమానితులను గుర్తించి... నమూనాల్ని పరీక్షలకు పంపించారు. జిల్లావ్యాప్తంగా 9 వేల మంది ప్రభుత్వ, హోం క్వారంటైన్లలో ఉన్నారు. ఈ నెల 8 తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
15 వార్డుల్లో రెడ్ అలర్ట్
సూర్యాపేట జిల్లాలో 20 మందికి కరోనా పాజిటివ్ రాగా... జిల్లా కేంద్రంలో 12, నాగారం మండలం వర్ధమానుకోటలో 6, తిరుమలగిరి, నేరేడుచర్లలో ఒక్కొక్కరికి వైరస్ సంక్రమించింది. ప్రస్తుతం ఈ జిల్లాల్లో వంద మంది ప్రభుత్వ క్వారంటైన్లలో, 573 మంది హోం క్వారంటైన్లలో ఉన్నారు. 2 వందల నమూనాలు పరీక్షలకు పంపగా... 90 మంది నివేదికలు రావాల్సి ఉంది. పట్టణంలోని 15 వార్డులను రెడ్ జోన్లుగా ప్రకటించారు. నిన్న ఒక్క రోజే 11 కేసులు నమోదైనందున... జిల్లా కేంద్రం సహా రెడ్ అలర్ట్ జోన్లలో నిఘా పెరిగింది. అనుమానితులను గుర్తించేందుకు...నేరేడుచర్లలో 50, తిరుమలగిరిలో 37 బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే 60 మందిని క్వారంటైన్లకు తరలించారు.
ఇద్దరి నుంచే 17 మందికి
జిల్లాలో నమోదైన 20 పాజిటివ్ కేసుల్లో... 17 మందికి కేవలం ఇద్దరి వల్లే వైరస్ వ్యాపించింది. సూర్యాపేట పట్టణంలోని కుడకుడకు చెందిన వ్యక్తితోనే 8 మందికి వైరస్ సోకింది. ఔషధాల కోసం దుకాణానికి వెళ్లినప్పుడు అందులో పనిచేసే భగత్ సింగ్‌నగర్ వాసికి వ్యాధిని అంటించాడు. భార్యతోపాటు నాగారం మండలం వర్ధమానుకోటలోని అతని అత్త, ఇద్దరు బామ్మర్దులు, వారి భార్యలకు కరోనా సంక్రమించడంలో కారకుడయ్యాడు. మర్కజ్ నుంచి తిరుగు ప్రయాణంలో తిరుమలగిరిలో బస చేశాడు. అక్కడ వంట చేసిన వ్యక్తికి కూడా వైరస్‌ను అంటించాడు. కొత్తగూడెం బజారుకు చెందిన వ్యక్తి ద్వారా... తన కుటుంబంలోని యువతికి వైరస్ సోకింది. అదే వ్యక్తి కూరగాయల మార్కెట్లో ఇంకో 8 మందికి వైరస్ వ్యాపించేందుకు దోహదకారిగా మారాడు.
ఇదీ చూడండి: 'మర్కజ్ కేసులతో అంచనాలన్నీ తారుమారయ్యాయి'