రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలన్నింటిని వెంటనే భర్తీ చేయాలని యువ తెలంగాణ పార్టీ నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణిరుద్రమ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, తిరుమలగిరి, మోత్కూరు మండల కేంద్రాల్లోని పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం, మాట ముచ్చట కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
మొదటి డిమాండ్ మాదే..
రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు సంస్థల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను స్థానికులకు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. మొదటగా.. నిరుద్యోగ భృతి రూ. 5వేలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది కేవలం యువ తెలంగాణ పార్టీయేనని గుర్తు చేశారు. విద్యాసంస్థలను నిర్వీర్యం చేసేందుకు రాష్ట ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం కల్పిస్తే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నేరవేర్చేందుకు రాష్ట ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని అన్నారు.
రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో యువ తెలంగాణ పార్టీ కీలకం కానుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిట్టా బాలకృష్ణ రెడ్డి తెలిపారు. స్థానికంగా ఉన్న విద్యాసంస్థల్లో వారు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమారపు శంకర్, నల్గొండ జిల్లా అధ్యక్షులు బంగారయ్య, ప్రైవేటు పాఠశాలల మండంల కన్వీనర్ శ్రీనివాస్, సైదులు, యాదయ్య, మేరీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సాగు భళా.. రుణం డీలా...