ముఖ్యమంత్రి కేసీఆర్... గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసి వ్యవసాయాన్ని పండగలా మార్చారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తొండ, నాగరం మండలంలోని వర్ధమానుకోట గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నాగరంలో మొక్కలు నాటారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలన్న ఉద్ధేశంతో రాష్ట్రంలో 900 పైగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు.. సబ్భండ వర్గాలు సంతోషంగా, ఆత్మగౌరవంతో జీవించేలా దోహదం చేస్తున్నాయని తెలిపారు.
బడ్జెట్‌లో 50 శాతానికి పైగా నిధులు వ్యవసాయం కోసం ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. రైతు వేదికల ద్వారా మార్కెటింగ్ అంశాలు, సాగు, వ్యవసాయ యాంత్రీకరణ, ధర నిర్ణయించే అధికారం తదితర అంశాలపై రైతులు సమగ్రంగా చర్చించుకుని, అవగాహన పొందే అవకాశం ఉంటుందన్నారు.
ఇదీ చూడండి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు: మంత్రి సబిత