సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలోకి భారీగా వరద నీరు చేరింది. పులిచింతల బ్యాక్ వాటర్ ఆలయం చుట్టూ చేరడం వల్ల రక్షణ గోడ నుంచి నీరు లీక్ అవుతూ సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి వరకు చేరుకుంది. భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నట్టు ఈవో తెలిపారు. కరకట్ట మరమ్మతు కోసం... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నివేదిక సమర్పించినట్టు వెల్లడించారు.
ప్రస్తుతం ఆలయ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని, ఆలయ విశిష్ఠతను కాపాడుకోవాలంటే రక్షణ గోడ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 1100వ సంవత్సరంలో వెలసిన ఆలయాన్ని ఆంధ్ర, తెలంగాణ భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారని తెలిపారు. సంతానం లేని మహిళకు సంతానం కలిగించే ప్రసిద్ధ దేవాలయంగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.