అందరూ విధిగా తమ చరవాణిల్లో ‘ఆరోగ్యసేతు’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ముఖ్యంగా ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా వినియోగించాలని నిబంధనలు తెచ్చింది. దీనిద్వారా పొంచి ఉన్న ముప్పును, మహమ్మారిని ఎదుర్కోవడంతోపాటు సూచనలు, సలహాలు పొందవచ్ఛు.
కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన సూర్యాపేటలోనూ ఈ యాప్‌ను అతి తక్కువ మంది వినియోగిస్తున్నారు. ఈ పురపాలిక పరిధిలో 1.20 లక్షల మంది ప్రజలున్నారు. వీరిలో ఇప్పటి వరకు కేవలం 15,856 మంది మాత్రమే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ‘పేట’లో దాదాపు 50వేల స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నప్పటికీ అందులో 50 శాతం కూడా డౌన్‌లోడ్ చేసుకోలేదు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధిక జనాభా ఉన్న నల్గొండ పురపాలికలోనూ కేవలం 19,141 మంది మాత్రమే యాప్‌ను వినియోగిస్తున్నారు భువనగిరిలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ 7,709 మంది యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో అందరూ వివిధ అవసరాల ని మిత్తం బయటకు వస్తున్నారు. వలస కార్మికులు జిల్లాలకు చేరుతున్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
యాప్ పనిచేసే విధానం
- ఈ యాప్‌నుడౌన్‌లోడ్ చేసి మన వివరాలను నిక్షిప్తం చేయాలి.
- తొలుత స్వీయ అంచనా పరీక్షను పూర్తిచేయాలి. ఆరోగ్య సమస్యలు, ప్రయాణాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. వీటి ఆధారంగా ఆరోగ్య పరిస్థితిని అంచనా అది వేస్తుంది.
- యాప్‌ను వినియోగించేవారు బ్లూటూత్, జీపీఎస్‌ను ఎల్లప్పుడూ ఆన్‌చేసి ఉంచాలి. వీటి ద్వారా ఎవరైనా పాజిటివ్ లేదా అస్వస్థతకు గురైన వ్యక్తి మన సమీపంలోకి వస్తే సందేశం ద్వారా అప్రమత్తం చేస్తుంది.
విమాన ప్రయాణికులకు తప్పదు
విమాన ప్రయాణం చేసేవారు తమ చరవాణిల్లో తప్పనిసరిగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలా చేయని వారిని ఎయిర్‌పోర్టు సిబ్బంది లోనికి అనుమతించరు. వారు డౌన్‌లోడ్ చేయించి స్వీయ పరీక్ష చేసుకునేలా సూచిస్తారు. అందులో మీ ద్వారా కరోనా సంక్రమిస్తుందని తేలితే లోనికి అనుమతించరు. దీనితోపాటు బస్సు, రైళ్లలో ప్రయాణించేవారు యాప్‌ని వాడటంతో సురక్షితంగా ఉండవచ్ఛు.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఆరోగ్య సేతు’ యాప్ ఎంతో ఉపయోగకరం. పురపాలికల్లోని ప్రజలందరూ వినియోగిస్తే మేలు. ఈ యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది. ఇది పూర్తిగా సురక్షితమైనది. స్మార్ట్‌ఫోన్ వాడే అందరూ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-రామాంజులరెడ్డి, పురపాలిక కమిషనర్, సూర్యాపేట
ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పురపాలికల్లో ఆరోగ్యసేతు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య
తిరుమలగిరి 1,716
నాగార్జునసాగర్ 1,874
మిర్యాలగూడ 14,345
కోదాడ 12,191
నల్గొండ 19,141
సూర్యాపేట 15,856
భువనగిరి 7,709
చౌటుప్పల్ 7,144