సూర్యాపేట జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. హుజూర్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, నూతనంగా ఏర్పాటుచేసిన ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెరాస పార్టీ కార్యాలయ ఆవరణలో జెండా ఎగురవేశారు.
ఎందరో త్యాగదనుల త్యాగ ఫలితం వల్లే మనం స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నామని గుర్తుచేశారు. నవ నూతన భారతావని నిర్మాణంలో యువతదే ప్రధాన పాత్ర అని అన్నారు. యువత శాస్త్ర సాంకేతికను రాణించాలన్నారు. కొత్త కొత్త ఆవిష్కరణలకు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఇండస్ట్రియల్ పార్చు ఏర్పాటు కాబోతోందని, నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మొండుగా ఉంటాయని వెల్లడించారు.
కొవిడ్ -19ను అరికట్టడంలో ప్రభుత్వ అధికారుల కృషి వెలకట్టలేనిదన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, వారు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులకు పూర్తి అధికారాలు, స్వేచ్ఛ ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తోందని, త్వరలో నియోజకవర్గంలోని ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూం ఇళ్లను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గెల్లి అర్చన రవి, వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, ఎమ్మార్వో జయశ్రీ, ఎంపీపీ గూడెపు శ్రీను, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లో ఉత్సాహంగా స్వాతంత్య్ర వేడుకలు