రాష్ట్రవ్యాప్తంగా ఒక వైపు బతుకమ్మ పండుగ హడాహుడి కొనసాగుతుంటే... హుజూర్‌నగర్‌లో మాత్రం ఉపఎన్నిక వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే తెరాస,కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను ప్రకటించగా... భాజపా మాత్రం గెలుపు గుర్రం ఎంపికలో మల్లగుల్లాలు పడుతోంది. తెతెదేపా పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నామినేషన్ల పర్వం తుది అంకానికి చేరుతున్న పరిస్థితుల్లో... రాజకీయ ప్రచారం మరింత ఊపందుకుంటోంది.
విమర్శల వాన...
అందరికన్నా ముందుగా తన కంచుకోటలో ప్రచారాన్ని ఆరంభించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి... అధికార పార్టీ తీరు, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గుత్తా... పాలకవీడు జడ్పీటీసీ, సర్పంచిని తెరాస గూటికి చేరడంలో కీలక పాత్ర పోషించారంటూ నియోజకవర్గ కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు చేశారు. దీనిపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు... కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సీనియర్ అనే గౌరవం కూడా ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్ పై పీసీసీ అధ్యక్షుడు మండిపడ్డారు. ఒక సాధారణ ఉప ఎన్నికను ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం వెనుక తెరాస అంతర్యం ఏమిటని హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓడిపోతామన్న అభద్రతాభావంతోనే భారీస్థాయిలో నేతల్ని హుజూర్‌నగర్‌కు పంపుతున్నారని ఆరోపించారు.
ఉత్తమ్ తీరుపై అధికార పార్టీ నేతలు... విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఉపఎన్నికల బాధ్యుడు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , కర్నె ప్రభాకర్ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయాల్లో ఉండాల్సింది సిన్సియారిటీ... సీనియారిటీ కాదన్నారు. ప్రతిగా కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్... వ్యవస్థల్ని అధికార పార్టీ దుర్వినియోగం చేస్తోందంటూ దుయ్యబట్టారు.
జోరందుకున్న ప్రచారం...
హుజూర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతే అయినా... గత వారం నుంచి ఉత్తమ్ నియోజకవర్గంలో మకాం వేసి మండలాలన్నీ చుడుతున్నారు. హంగూ, ఆర్భాటాలు లేకుండా మారుమూల పల్లెల్లో పర్యటిస్తున్నారు. ఇటు ఉత్తమ్‌ను ఈ స్థాయిలో గ్రామాల బాట పట్టించడానికి తానే కారణమంటున్న తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సైతం... గ్రామాలను చుట్టివస్తున్నారు. సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, స్థానిక నాయకులతో కలిసి... అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు. ఇన్ఛార్జిగా నియమితమైన పల్లా రాజేశ్వర్ రెడ్డి... నియోజకవర్గానికి చేరుకుని స్థానిక శ్రేణులతో సమాలోచనలు జరుపుతున్నారు. సమన్వయకర్తల్ని మూడు బృందాలుగా విభజించి... ఎన్నికల ప్రచార రణరంగంలోకి దింపుతున్నారు.
ఇప్పటికైతే ఇలా రెండు పార్టీల ముఖ్య నేతల పరస్పర విమర్శనాస్త్రాలతో... హుజూర్నగర్ రాజకీయం వేడెక్కినట్లు కనపడుతోంది. మరి మిగతా పక్షాలు కూడా రంగంలోకి దిగితే... అది మరింత బలపడే ఆస్కారముందని చెప్పవచ్చు.
ఇవీ చూడండి:నాగార్జున సాగర్ 14 క్రస్ట్ గేట్లు ద్వారా నీటి విడుదల