తెరాస, కాంగ్రెస్కు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్నగర్ ఉప ఎన్నికలో... రాజకీయ మంత్రాంగాలు కొనసాగుతున్నాయి. విజయం కోసం స్థానిక నాయకులను మచ్చిక చేసుకునేందుకు... ఇరుపార్టీలు పోటాపోటీగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఏం కావాలన్నా ఇస్తాం కానీ... మీ గ్రామం, లేదా మండలంలోని ఓట్లు మాకే పడాలి... అంటూ తెరచాటుగా మంతనాలు చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరాదన్న ఉద్దేశంతో... అటు గులాబీ దళం, ఇటు హస్తం దండు పెద్దయెత్తున యత్నిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో గెలుపు దక్కించుకోవాలంటే... స్థానిక నాయకుల అండదండలు అవసరం. సభలు, సమావేశాలకు జనసమీకరణను చేపట్టే క్షేత్రస్థాయి నాయకగణం... స్థానిక పరిస్థితుల్ని తిరగరాయడంలో దిట్టలుగా ఉంటారు. అందుకే తటస్థులుగా ఉన్న నాయకుల్ని... ఎంతైనా ఇచ్చి తమ వైపునకు తిప్పుకునే మంతనాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి.
హుజూర్నగర్ నియోజకవర్గంలో 80 శాతం మందికి పైగా నాయకులు... పంచాయతీ, పరిషత్తు ఎన్నికల్లో పోటీ చేసి భారీగా ఖర్చు చేసినవారే. గెలిచిన వారికి నిధుల్లేక... ఓడిన వారికి ఖర్చులు సరిపోక ఆర్థిక భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు వెచ్చించిన మొత్తాన్ని ఉప ఎన్నికల రూపంలో తిరిగి రాబట్టుకునే ఆలోచనలో పడ్డారు చాలా మంది. ఏ పార్టీ ఎంత మొత్తంలో ముట్టజెపుతుందో... అటువైపు మద్దతు తెలపాలన్న భావన క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకుల్లో కనపడుతోంది.
ప్రధాన పార్టీలు తాజా పరిస్థితులపై... యువకులతో సర్వే చేయిస్తూ, తాయిలాలు ఇచ్చే పనిలో పడ్డాయి. ఇలా రెండు పార్టీల్లోని నేతలు... ఒకరికి మించి మరొకరన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.