నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి... వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ధాన్యం అమ్ముకునే ఈ సీజన్లో చేతికందిన పంట కాస్తా కళ్లముందే వర్షార్పణమై... అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
నీటమునిగిన వరి.. తడిచిన పత్తి
24గంటలుగా కురిసిన భారీ వర్షాలతో నల్గొండ జిల్లా పానగల్ బైపాస్ వద్ద మోకాళ్ల లోతులో నీరు చేరి... రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు రంగంలోకి దిగి రాకపోకల్ని క్రమబద్ధీకరించారు. వీటీ కాలనీ, క్లాక్ టవర్ సహా పలు కాలనీలు సహా లోతట్టు ప్రాంతాలు నదుల్ని తలపించాయి. మిర్యాలగూడ-హైదరాబాద్ దారిలోని నిడమనూరు మండలంలో తాత్కాలిక వంతెన దెబ్బతినడంతో... ఆ మార్గంలో వెళ్లే వాహనాల్ని నల్గొండ మీదుగా దారి మళ్లిస్తున్నారు. అనుముల, పెద్దవూర, తిరుమలగిరి మండలాల్లో 1,238 ఎకరాల్లో పత్తి, 130 ఎకరాల్లో వరి... నిడమనూరు మండలంలో 1500 ఎకరాల్లో పత్తి పనికిరాకుండా పోయింది.
నకిరేకల్‌లో ఎటు చూసినా నీరే..
దేవరకొండ, డిండి, కొండమల్లేపల్లి మండలాల్లో 487 ఎకరాల్లో పత్తి, 75 ఎకరాల్లో వరి నేలకొరిగింది. నకిరేకల్‌లో... తహసీల్దార్ కార్యాలయం, మినీ స్టేడియం, కోర్టు ఆవరణ, పౌరసరఫరా గిడ్డంగిలో నీరు చేరింది. మునుగోడు నియోజకవర్గంలో పత్తి పంటపైనే ఆధారపడ్డ వందలాది మంది రైతులు... తెల్ల బంగారాన్ని కోల్పోయి అప్పుల పాలవుతున్నారు.
మూసీ గేట్లు ఎత్తిన అధికారులు
సూర్యాపేట జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. మూసీ జలాశయానికి వస్తున్న వరద వల్ల... 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన నాలా పొంగిపొర్లుతుండటంతో... చర్చి కాంపౌండ్, తేజ టాకీస్ పరిసరాలు చెరువులను తలపిస్తున్నాయి. వరదనీరు వెళ్లేందుకు వీలుగా పుల్లారెడ్డి చెరువు శివారులో... నాలా గోడల్ని పురపాలిక సిబ్బంది కూల్చివేశారు. పట్టణ శివారు ప్రాంతాలైన ప్రియాంక కాలనీ, తిరుమల నగర్, శ్రీరాం నగర్, వినాయక నగర్, మానస నగర్లో... ఇళ్ల చుట్టూ వరద చేరింది.
చేతికందిన పంట నీటిపాలైంది...
ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ వద్ద పాత సూర్యాపేట చెరువు నీరు... సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపైకి చేరింది. ఈ మండలంలో 385 ఎకరాల్లో వరి... 84 ఎకరాల్లో పత్తి పంటను రైతులు కోల్పోయారు. నూతనకల్ మండలంలో వెయ్యి ఎకరాల్లో వరి, 5 వందల ఎకరాల్లో పత్తి... మద్దిరాల మండలంలో 168 ఎకరాల్లో తెల్ల బంగారం... తుంగతుర్తి మండలంలో వంద ఎకరాల్లో వరి, మరో వంద ఎకరాల్లో పత్తి కోల్పోవాల్సి వచ్చింది.
కొమరబండ మేజర్ కాల్వకు గండి
కోదాడ నియోజకవర్గవ్యాప్తంగా 1,500 ఎకరాల్లో పంట నష్టం జరగ్గా... నడిగూడెం, చిలుకూరు, కోదాడ, మునగాల మండలాల్లో వరి దెబ్బతింది. నడిగూడెం మండలంలో మిరప, పత్తికి స్వల్ప నష్టం వాటిల్లగా... అదే మండలం ఎక్లాస్ ఖాన్ పేట వద్ద కొమరబండ మేజర్ కాల్వకు గండి పడింది. ఆత్మకూరు(ఎస్) మండలం నసీమ్ పేట వద్ద లో-లెవెల్ కల్వర్టుపై నీటి ఉద్ధృతితో... రాకపోకలు నిలిచిపోయాయి. గరిడేపల్లి మండలం కోదండరామాపురంలో పంటలు దెబ్బతిన్నాయి. చింతలపాలెం మండలం దొండపాడు వద్ద ఎర్రవాగుకు వచ్చిన వరదతో... రాకపోకలు స్తంభించాయి.
మోత్కూరులో కూలిన రైస్‌మిల్లు పైకప్పు
యాదాద్రి భువనగిరి జిల్లా కొనుగోలు కేంద్రాల్లో... భారీవర్షాలకు ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. వర్షపు నీటితో గుండాల పోలీసు ఠాణా జలమయం కాగా... మోత్కూరులో పారాబాయిల్డ్ రైస్ మిల్లు కూలి 3 వేల ధాన్యం బస్తాలు, మరో 2 వేల బియ్యం బస్తాలు తడిశాయి. వలిగొండ మండలం గోపరాజుపల్లి, ఏదుల్లగూడెం, అరూర్, గురునాథ్ పల్లి, నర్సాపురం, వేములకొండ, మల్లేపల్లి, వెల్వర్తి, కాంచనపల్లి ధాన్యం కేంద్రాల్లో... సరుకు పనికిరాకుండా పోయింది.
మంగళవారం ఉదయం నుంచి మూడు జిల్లాల పరిధిలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగడంతో... పట్టణాలు, గ్రామాల్లో అంధకారం అలుముకుంది. కొన్ని ప్రాంతాల్లో పాత ఇళ్లు కూలిపోయి... కుటుంబాలు వీధిన పడ్డాయి.