సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో స్థానిక చౌదరి చెరువు పొంగిపొర్లుతోంది. ఫలితంగా పలు లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రాహదారిపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరి టీవీలు, ఫ్యాన్లు, నిత్యావసర వస్తువులు, సరకులు పూర్తిగా నీట మునిగాయి. నీటిని తోడేసేందుకు ప్రజలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొందరు స్థానికంగా ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్లో తలదాచుకున్నారు.
మరోవైపు వేణు గోపాలపురం, బృందావనపురం గ్రామాల్లో పత్తి పంట నీట మునిగింది. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు. మండలంలో ఇప్పటి వరకు 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీచూడండి: కర్నాటక మీదుగా ఆవర్తనం.. దక్షిణ తెలంగాణకు వర్షగండం