సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం ఓ విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేసింది. నేరేడుచర్లకు చెందిన విద్యార్థిని ఐదో తరగతిలో ప్రవేశం నిమిత్తం తుంగతుర్తి గురుకుల పాఠశాలలో సీటు పొందింది. ఆమెను పాఠశాలలో చేర్పించిన నాటి నుంచి ఇప్పటివరకు తల్లిదండ్రులు ఆమె దగ్గరికి రాకపోవడం, ఈ పాఠశాలలో విద్యను అభ్యసించడం ఇష్టంలేకపోవడమే ప్రధాన కారణాలని తెలిపింది. మధ్యాహ్న భోజనం విరామానంతరం గదిలో ఎవరూ లేరని గమనించిన విద్యార్థి... ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోయింది. తోటి విద్యార్థిని గమనించి హుటాహుటిన ఉపాధ్యాయులను అప్రమత్తం చేసింది. తలుపులు నెట్టి ఆమెను బలవంతంగా కిందికి లాగింది. బాలిక పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు తొలుత స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం మెరుగైన వైద్య సేవల నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: ద్వాదశాదిత్యుడి అవతారంలో ఖైరతాబాద్ మహాగణపతి