సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో నియోజకవర్గంలోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీల రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఇందిరా పార్క్ నుంచి మిర్యాలగూడెం రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
తరతరాల నుంచి రైతులను పట్టిపీడిస్తున్న రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను రూపుమాపి నూతన చట్టం తీసుకువచ్చి రైతుల్లో ఆనందం నింపిన అపర భగీరథుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. త్వరలో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి జరుగుతుందన్నారు. గతంలో పరిపాలించిన నాయకులు తెలంగాణ రైతులకు వ్యవసాయం దండగని అన్నారని.. అలాంటిది ఇప్పుడు దేశంలో వ్యవసాయంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు.
భాజపా సర్కారు అప్రజాస్వామిక మొండి వైఖరితో వ్యవసాయ బిల్లును ఆమోదించి రైతుల గొంతు నొక్కిందని సైదిరెడ్డి ఆరోపించారు. భాజపా నాయకులకు రైతులు, వ్యవసాయంపై అవగాహన లేదని విమర్శించారు.
ఇదీ చదవండి: కొత్త రెవెన్యూ చట్టంపై రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం