సూర్యాపేట జిల్లా నాగారం మండలం మామిడిపల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో అవకతవకలకు కారణమైన కేంద్రం నిర్వాహకురాలిపై చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులు నిరసన చేపట్టారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు రసీదు ఇచ్చిన మొత్తానికి బ్యాంకులో ప్రభుత్వం జమచేసిన మొత్తానికి తేడాలున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ కేంద్రం నిర్వాహకురాలు గద్దల ఎల్లమ్మ, మిల్లర్లు తమను మోసం చేశారని ఆరోపించారు. వారిని అడిగితే ధాన్యంలో వచ్చే తరుగునుబట్టి మిల్లర్లు డబ్బు జమ చేశారని నిర్వాహకురాలు అంటున్నారని తెలిపారు.
కొనుగోలు సమయంలో తరుగును తీయగా.. మళ్లీ మిల్లర్లు తరుగు తీయడమేంటని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలు రాకపోవడం వల్ల సొంత ఖర్చులతో మిల్లర్లకు ధాన్యాన్ని రవాణా చేయగా.. ఆ డబ్బులు ఇప్పటి వరకు తమకు అందలేదని తెలిపారు. అధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.
ఏపీఎం ప్రమీలను వివరణ కోరగా మామిడిపల్లి ఐకేపీ కేంద్రాల్లో నిర్వాహకులు అవకతవకలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దానిపై విచారణ జరుపనున్నట్లు చెప్పారు. అవకతవకలు నిజమని తేలితే ఆమెను తొలగిస్తామని వెల్లడించారు.
ఇవీ చూడండి: జిల్లా అధికారిక వెబ్సైట్ను ప్రారంభించిన కలెక్టర్