అందివచ్చిందే అవకాశంగా వ్యాపారుల దోపిడీ... చోద్యం చూస్తున్న అధికారులు... వెరసి ఆరుగాలం శ్రమించిన రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. అధికారులు విస్పష్ట ఆదేశాలు జారీ చేసినా... క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. క్వింటాలు సన్న ధాన్యానికి 18 వందలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా... సరకులో నాణ్యత లేదన్న సాకుతో 16 వందల నుంచి 17 వందల లోపే మిల్లర్లు చెల్లిస్తున్నారు. పంట పండించటం ఒక ఎత్తయితే... వాటిని అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారిందని అన్నదాతలు వాపోతున్నారు.
మిల్లుల ఎదుట పడిగాపులు...
నియంత్రిత సాగు విధానంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రైతులు సన్న ధాన్యాన్ని ఎక్కువగా సాగుచేశారు. విస్తారంగా పడ్డ వానల వల్ల దిగుబడి కాస్త తగ్గినా... మద్దతు ధరకు కొంటామన్న సర్కార్ ప్రకటనతో రైతులు ఆనందపడ్డారు. తీరా పంట చేతికొచ్చాక అమ్ముకుందామంటే అన్నదాతలు హరిగోస పడుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో చాలా మిల్లర్లు రైతులను వంచిస్తున్నారు. ఒక్కో రైతు అమ్ముకోవడానికి కనీసం మూడురోజులు పడుతోంది. ఒక్కో మిల్లు ఎదుట వందలాది ట్రాక్టర్లతో ధాన్యం తెచ్చి రైతులు పడిగాపులు కాస్తున్నారు. సరకు 24 గంటల్లో కొనుగోలు చేయకపోతే రంగు మారే ప్రమాదముంది. ఎక్కువ రోజులుంటే వాహనాల కిరాయి భారం మీద పడుతుందని వచ్చినకాడికి తెగనమ్ముకుని కర్షకులు భారంగా ఇళ్ల బాట పడుతున్నారు.
నిరసనల పరంపరా...
సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో రైసుమిల్లుల ఎదుట రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర 1800 రూపాయలకు ధాన్యం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అధిక వర్షాలతో ఎకరాకి 20 బస్తాలు సైతం పండలేదని...ఆ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ధాన్యానికి నిప్పుపెట్టి నిరసన తెలిపారు. మెదక్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ... రైతులు ఆందోళనకు దిగారు. దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, సన్న రకాలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.