సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో బాణోత్ వెంకటేశ్వర్లు అనే వ్యాపారి తప్పుడు తూకంతో తమను మోసగిస్తున్నట్లు రైతులు గుర్తించారు. ఒక్కొక్క బస్తాకి 5 నుంచి 10 కేజీలు వరి ధాన్యాన్ని అదనంగా తూకం వేస్తూ.. తమని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళన చేపట్టారు.
'రేగులగడ్డ తండాకి చెందిన వెంకటేశ్వర్లు 10 సంవత్సరాల నుంచి ధాన్యం వ్యాపారం చేస్తున్నాడు. గతంలో కూడా ఇలా మోసం చేశాడు. ఆరుగాలం పండించి దళారులకు సమర్పించుకోవాల్సి వస్తుంది. 70 కేజీల సంచికి 75 నుంచి 78 కేజీలు తూకం వేస్తూ మోసం చేస్తున్నాడు. కంప్యూటర్ తూకం వేయడం వల్ల మోసం బయట పడింది.'
-రైతులు
ఒక్కో సంచికి 2 కేజీలు కటింగ్ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.
ఇదీ చూడండి: సాగర్ సమరం: ముగిసిన నామినేషన్ల గడువు