కేటీఆర్ రోడ్‌షో
ఇప్పటికే సభ ఏర్పాటు చేసి అగ్ర నేతలందర్నీ రప్పించిన హస్తం పార్టీ... ఇక ముందు కూడా కీలక నేతల్ని రంగంలోకి దించబోతోంది. తెరాస నుంచి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్... నేడు హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రోడ్ షో అనంతరం పార్టీ నేతలతో సమాలోచనలు జరపనున్నారు. పార్టీ బలాలు, బలహీనతలపై దృష్టి సారించిన మండల ఇంఛార్జిలు సెగ్మెంట్లోని పరిస్థితులపై అవగాహనతో ముఖ్య నేతల్ని రంగంలోకి దించాలని తెరాస భావించింది. అందులో భాగంగానే కేటీఆర్ ఉపఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు.
హస్తం నేతల ఐక్యతారాగం
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ సైతం... ఇవాళ హుజూర్‌నగర్‌లో పర్యటించనున్నారు. కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన కోదండరామ్... ఉత్తమ్‌తో సమావేశం కానున్నారు. గత పది రోజుల నుంచి ఒంటరి పర్యటనలతో ప్రచారం చేపడుతున్న ఉత్తమ్... ఇక పార్టీ ముఖ్య నేతల్ని రంగంలోకి దించబోతున్నారు. అంటీముట్టనట్లుగా వ్యవహరించే నేతలంతా ఐక్యతారాగం వినిపిస్తుండటం వల్ల నియోజకవర్గంలోని హస్తం శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది.
భాజపా భేరి
భాజపా అభ్యర్థి కోటా రామారావు సైతం... విస్తృత రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. నామపత్రాలు దాఖలు చేసిన రోజు పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ప్రచారం చేసిన రామారావు... ఇప్పుడు పల్లెల బాట పడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలు, ఎంపీలకు మండలాల బాధ్యతలు అప్పగించడంతో... భాజపా నేతలంతా నియోజకవర్గానికి చేరుకుంటున్నారు.
మేమేం తక్కువ కాదు
ఇలా ప్రధాన పార్టీలతో పాటు... తామేం తక్కువ కాదన్నట్లు స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
- ఇదీ చూడండి : కొలిక్కిరాని ఆర్టీసీ సమ్మె చర్చలు.. అయోమయంలో ప్రజలు!