రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని గుండెబోయిన గూడెంలో మునిగిపోయిన పంటపొలాలను సీపీఎం బృందం పరిశీలించింది. అకాల వర్షంతో పంట పొలాలు మునిగి చేతికొచ్చే దశలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ధీరావత్ రవి నాయక్, మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాశ్ వాపోయారు.
కృష్ణా పరివాహక ప్రాంతాలైన రాగిపాడు మహంకాళి గూడెం, గుండెబోయిన గూడెం గ్రామాల్లో వందలాది ఎకరాలు వరి, పత్తి పంట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. గ్రామాల్లో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంట నష్టం అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదించాలన్నారు. ప్రభుత్వం ద్వారా ఎకరానికి రూ. 25 వేల నుంచి రూ. 40 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.