సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నాగారం రహదారిపై ఎంఎస్ఎఫ్, బీజేవైఎం నాయకులు వరి నాట్లు వేస్తూ నిరసన తెలిపారు. నాగారం నుంచి తుంగతుర్తి వరకు గల ప్రధాన రహదారి పెద్ద పెద్ద గుంతలు పడి వర్షానికి గుంతల్లో నీళ్లు చేరి బురదమయంగా మారటంతో నిరసన వ్యక్తం చేశారు. తుంగతుర్తి మండలంపై మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ వివక్ష చూపుతూ అభివృద్ధిని కాలరాస్తున్నారని తుంగతుర్తి నియోజకవర్గ ఇంఛార్జి కందుల రవికుమార్ ఆరోపించారు.
తుంగతుర్తి నుంచి నాగారం వరకు వేసిన రోడ్డు అందుకు నిదర్శనమన్నారు. పసునూరు నుంచి 9 వరకు రోడ్డు వేయకపోవటం వల్ల గుంతల మయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణిస్తున్నారన్నారు. ఇప్పటికైనా... స్థానిక ఎమ్మెల్యే స్పందించి నూతన రోడ్లు వేయించాలని కోరారు. లేనిపక్షంలో అన్ని పార్టీలను విద్యార్థి సంఘాల తరఫున ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు నారాయణ, నాగరాజు, ఎంఎస్ఎఫ్ నాయకులు సురేశ్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.