వ్యవసాయరంగ పురోభివృద్ధికి విభిన్న కోణాల్లో కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) పురస్కారాలను ప్రకటించింది. 93వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వీటిని ప్రకటించారు. తెలంగాణకు 3, ఆంధ్రప్రదేశ్‌కు 1 లభించాయి. వీటిలో హైదరాబాద్‌లోని ఐసీఏఆర్ కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ (క్రిడా)కు చౌదరీ దేవీలాల్ అత్యుత్తమ భారతదేశ సమన్వయ పరిశోధన ప్రాజెక్టు అవార్డు-2020 దక్కింది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లోని 24 జిల్లాల్లో కరువు నివారణ కార్యక్రమాలు చేపట్టి, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే పంటలను ప్రోత్సహించినందుకు కేంద్ర వ్యవసాయశాఖ ఈ అవార్డు ప్రకటించింది.
నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ అగ్రికల్చర్ రీసెర్చ్ విభాగంలో రఫీ అహమ్మద్ కిద్వాయ్ అవార్డు క్రిడాలో పనిచేస్తున్న వినోద్‌కుమార్‌సింగ్‌కు దక్కింది. ఆపరేషనల్ రీసర్చ్ ప్రాజెక్టు కేంద్రం ఏఐసీఆర్‌పీడీఏ ఇండోర్ (క్రీడా సంస్థ పరిధిలోనిది)కి డా.వసంతరావు నాయక్ పురస్కారం దక్కింది. విజయనగరంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ముఖ్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్న తణుకు శామ్యూల్ ఎస్‌కే పాత్రోకి ఫకృద్దీన్ అలీ అహ్మద్ అవార్డ్ లభించింది.
సూర్యాపేట జిల్లా వాసికి ఆర్గానిక్ ఫార్మర్ అవార్డు
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నర్సింహులగూడెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు బండారు వెంకటేశ్వర్లుకి హల్దార్ ఆర్గానిక్ ఫార్మర్ అవార్డు దక్కింది. ఈయన తన 12 ఎకరాల్లో లాభదాయకంగా సమీకృత సేంద్రియ వ్యవసాయం చేసినందుకు ఈ అవార్డు ఇచ్చారు. మునగాల మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో వరి, బొప్పాయి, పలు రకాల కూరగాయలు, పండ్లు, నిమ్మ మొదలగు పంటలు పండిస్తూ లాభాలు గడిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ అవార్డు రావడం పట్ల వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు నర్సింహులగూడెం గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో సంతోషంగా ఉంది..
కొన్ని సంవత్సరాలుగా కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి వారి ప్రోత్సాహంతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. హల్దార్ ఆర్గానిక్ ఫార్మర్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇకపై రైతులకు సేంద్రియ వ్యవసాయంపై, పలు పద్ధతులపై అవగాహన కల్పిస్తా. వారికి కూడా వ్యవసాయంలోని మెలకువలు నేర్పేందుకు కృషి చేస్తా. -బండారు వెంకటేశ్వర్లు, హల్దార్ ఆర్గానిక్ ఫార్మర్ అవార్డు గ్రహీత
ఇదీ చదవండి: Dk Aruna : కేంద్రం నిర్ణయంతో ఏపీ జల దోపిడీకి అడ్డుకట్ట