సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన బొమ్మగాని రాజయ్య, రాధమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. రాజయ్య కల్లుగీత కార్మికుడిగా, రాధమ్మ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కొంతకాలంగా రాజయ్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స, కూతుళ్ల వివాహాలకు అప్పులు చేశారు. అన్నీ కలిపి రూ.5 లక్షల వరకు ఉన్నాయి. రోజువారీ సంపాదన కుటుంబ ఖర్చులకే సరిపోతుండటంతో అప్పులు తీరడం లేదు. దీనితో అప్పులు తీర్చే మార్గం కన్పించక పోవటం వల్ల భార్యాభర్తలు ఇద్దరూ మనోవేదనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 23న రాజయ్య తాటిచెట్టు ఎక్కేందుకు వెళ్లగా ఇంట్లో ఉన్న రాధమ్మ పురుగు మందు తాగింది. అతను తిరిగి ఇంటికి వచ్చే సరికి వంటగదిలో పడి ఉంది. నోట్లో నుంచి నురగ రావడం, పక్కనే పురుగు మందు డబ్బా ఉండటంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతురాలి భర్త రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి ఎస్‌ఐ తెలిపారు.