కరోనా రెండో దశతో ఓవైపు ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. మరోవైపు కొన్నిప్రదేశాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా చేరుతూ వైరస్ వాహకాలుగా మారుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రతి శుక్రవారం జరిగే.. పశువుల సంతకు చుట్టుపక్కల నుంచి వేలకొద్ది క్రయవిక్రయదారులు పశువుల కొనుగోలు, అమ్మకాల కోసం వస్తారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో భౌతిక దూరం పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం చెబుతున్నా.. అవేమీ పట్టనట్లు పశువుల సంతలో మాత్రం క్రయవిక్రయదారులు గుంపులు గుంపులుగా ఉంటున్నారు. వీరివల్ల వైరస్ వ్యాప్తి మరింత వేగంగా జరుగుతోందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు.. ఈ విషయం తెలిసినా.. పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. వారసంతలో క్రయవిక్రయదారులు కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.