ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తే... తామే సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో పొన్నం బుధవారం పర్యటించారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయి పరిహారం అందలేదంటూ.. భూనిర్వాసితులు పొన్నం ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు.
భూనిర్వాసితులకు పరిహారం అందే వరకు అండగా ఉంటామని పొన్నం భరోసా ఇచ్చారు. అనంతరం గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించారు. నిర్మాణంలో ఉన్న సర్జిపూల్ పంపులను పరిశీలించారు.
గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వాన్ని పొన్నం ప్రశ్నించారు. కుట్రపూరితంగానే గౌరవెల్లి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గండిపల్లి ప్రాజెక్టులో కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులు తప్ప తెరాస ప్రభుత్వం వచ్చాక ఒక్క తట్టెడు మట్టి కూడా పోయలేదని ఆక్షేపించారు.