సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేతలు నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని రైతాంగానికి సాగునీరు అందించే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హుస్నాబాద్‌లో కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టులను పూర్తిచేస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులను ప్రారంభించడం శుభపరిణామమని, ఇందుకు జిల్లా రైతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.
కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రంగనాయకసాగర్ ప్రాజెక్టులో ఇచ్చిన మాదిరిగా గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇస్తే జూన్ 1న కేసులు వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో అక్కు శ్రీనివాస్ , టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, డీసీసీ అధికార ప్రతినిధి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.