సిద్దిపేట జిల్లాలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. నాలుగు రోజుల కిందట ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం ఆ ప్రాంతవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీ కొన్న ఘటనలో చప్యాలకు చెందిన రొడ్డ పరశురాములు అక్కడికక్కడే మృతిచెందాడు. గజ్వేల్ నుంచి ఇంటికి తిరిగివెళ్తుండగా అతివేగంగా వచ్చిన టిప్పర్ అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. పరశురాములు కాళ్లు పైనుంచి టిప్పర్ వెళ్లడం వల్ల తీవ్ర రక్తస్రావం జరిగి మృతిచెందాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతునికి భార్య ఇందిర, కుమారుడు కార్తీక్ ఉన్నారు. బాధితుల రోదనలు అక్కడున్నవారిని కూడా కంటతడి పెట్టించాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన గజ్వేల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లను కఠినంగా శిక్షించాలని బాధితులు కోరారు.
ఇవీచూడండి: కారు, బైక్ ఢీ... ఇద్దరు మృతి