Minister Harish Rao at mulugu: ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్పితే... వ్యాపారాత్మక ధోరణితో వ్యవహరించకూడని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. వరిధాన్యం కొనబోమని కేంద్రం మొండికేసిందని.... ఈ పరిస్థితుల్లో రైతులను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. వర్సిటీ ఏర్పాటుచేసి ఏడేళ్లయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గత ఏడేళ్లలో కనుగొన్న కొత్త అంశాలు, పరిశోధనలతో ప్రదర్శన నిర్వహించారు. వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్ రావు... వర్సిటీలోని పరిశోధన విభాగాల ప్రదర్శనశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యానవర్సిటీ సాధించిన ప్రగతిపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి విడుదల చేశారు. అనంతరం, వర్సిటీ పండించిన పంటల విక్రయాలకు ట్రేడ్ మార్క్‌ను హరీశ్ రావు ఆవిష్కరించారు.
బోధనే కాదు
'ప్రభుత్వాలు లాభనష్టాలు చూసుకోకుండా.. ప్రజల కోసం పని చేయాలి. సాగు అంటే పండుగ అన్న స్థాయికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కోటి ఎకరాల మాగాణిగా మార్చారు. ప్రభుత్వం కొనలేని స్థాయిలో ధాన్యం పండిస్తున్నాం. ఉద్యాన వర్సిటీ కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలి. ఉద్యాన వర్సిటీ పరిశోధన ఫలాలు రైతులకు అందాలి. వర్సిటీల్లో బోధనే కాదు.. పరిశోధనలు కూడా ఉండాలి.' -హరీశ్ రావు, రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి
రైతులతో మమేకం కావాలి
వర్సిటీ విద్యార్థులు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని.. బోధనతో పాటు పరిశోధనలు ప్రజలు ఉపయోగపడేలా వాటి విస్తరణ జరగాలని మంత్రి హరీశ్ సూచించారు. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు రైతులకు మార్గం చూపే దిశగా కృషి చేయాలని ఉద్యాన వర్సిటీ ప్రొఫెసర్లను, విద్యార్థులను హరీశ్ కోరారు. పరిశోధనల కోసం వర్సిటీకి 140 ఎకరాలు ఇస్తామని.. రైతులతో మమేకమై సమస్యలు, అవసరాలు తెలుసుకోవాలని హరీశ్ రావు సూచించారు.
కేంద్రం చేతులెత్తేసింది
రాష్ట్రంలో వ్యవసాయంపై 13.5 శాతానికి మించి ఖర్చు చేస్తున్నామని మంత్రి అన్నారు. ఏడున్నరేళ్లలో సాగుపై 2.5 లక్షల కోట్లు ఖర్చు చేశామని.. ఆయిల్‌పామ్ సాగుచేస్తే ఎకరాకు రూ.1.40 లక్షల రాయితీ కల్పిస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనబోమంటూ కేంద్రం మొండికేస్తోందని.. ఆ విషయంలో కేంద్రం చేతులెత్తేసిందని ఆరోపించారు.
ఇదీ చదవండి: National Farmers day: కేంద్రం వైఖరితో రైతులకు ఇబ్బందులు: కేటీఆర్