పట్టణాభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పురపాలక ఛైర్మన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో గజ్వేల్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు వారికి వివరించారు. గజ్వేల్ స్ఫూర్తితో ఇతర ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టించాలని కేసీఆర్ సూచించారు. అనంతరం ప్రగతి భవన్ నుంచి సిద్దిపేట జిల్లాకు చేరుకున్న ప్రతినిధుల బృందం.. మొదట సింగాయపల్లి వద్ద చేపట్టిన అటవీ పునరుజ్జీవనాన్ని పరిశీలించింది. అటవీ పునరుజ్జీవనం చేసిన విధానాన్ని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మంత్రి హరీశ్ రావు వివరించారు.
మార్కెట్లో కలియతిరిగిన బృందం
సమీకృత మార్కెట్‌కు చేరుకున్న ప్రతినిధుల బృందానికి మంత్రి హరీశ్ రావు ఆహ్వానం పలికారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు మార్కెట్ మొత్తం కలియతిరిగి పరిశీలించారు. అమ్మకందారులు, కొనుగోలుదారుల అనుభవాలు తెలుసుకున్నారు. కొంత మంది మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు కూరగాయలు, పండ్లు కోనుగోలు చేశారు.
జిమ్‌లో కసరత్తులు
అనంతరం వైకుంఠధామానికి చేరుకున్నారు. అక్కడి పరిసరాలు చూసిన బృంద సభ్యులు ఆశ్యర్యపోయారు. శ్మశానం పార్కును తలపిస్తోందన్నారు. అక్కడి నుంచి సంగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్‌ను సందర్శించారు. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్య వాతవారణం నేపథ్యంలో అర్బన్ పార్కుల ఏర్పాటు అవశ్యకత గురించి తెలుసుకున్నారు. పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లో మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు కసరత్తులు చేశారు.
గజ్వేల్ స్ఫూర్తితో తమ ప్రాంతంలోనూ అభివృద్ధి పనులు చేపడతామని.. ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తామని ప్రజా ప్రతినిధులు తెలిపారు.
ఇవీ చూడండి: దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ 'ఈటీవీ భారత్'