Tourist places in telangana : రాష్ట్రంలో కొత్త పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ఆ శాఖ దృష్టి పెట్టింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో ఏర్పాటుచేసిన కొండపోచమ్మ సాగర్ పర్యాటకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ జలాశయంలో విహరించేందుకు 20 సీట్ల సామర్థ్యం ఉన్న రెండు బోట్లు త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. అక్కడ అయిదు నుంచి పదెకరాల విస్తీర్ణంలో హరిత హోటల్ ఏర్పాటుకు ప్రణాళికలున్నాయి. మరోవైపు గజ్వేల్‌లోని పాండవుల చెరువును పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చెరువు దగ్గర పంచ పాండవుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చెరువు పక్కన పార్కు, ఇతర ఏర్పాట్లు చేశారు.
యాదాద్రి సమీపంలోని బస్వాపూర్ రిజర్వాయర్ దగ్గర భారీ ఎత్తున పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు ఉన్నాయి. నాగార్జునసాగర్‌లో ఇటీవల ప్రారంభించిన బుద్ధవనం ప్రాజెక్టుకు పర్యాటకులను ఆకర్షించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడిపించేందుకు టూరిజం కార్పొరేషన్ సిద్ధం అవుతోంది. వన్యప్రాణులున్న అటవీప్రాంతంలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం..వెనకే కృష్ణమ్మ అందాలతో ఇక్కడ ప్రకృతి, జల పర్యాటకం బాగా వృద్ధి చెందే అవకాశం ఉందని పర్యాటకశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
బుద్ధవనం పక్కన ఎత్తైన ప్రదేశంలో రాతి బండలపై నుంచి చూస్తే చుట్టూ నీలి సంద్రం మాదిరి, ఎటుచూసినా కృష్ణమ్మ అందాలు ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతాన్ని ‘రివర్ వ్యూ టీ పాయింట్’గా అభివృద్ధి చేసేందుకు టూరిజం కార్పొరేషన్ ప్రణాళికలు రూపొందిస్తోంది. నాగార్జునసాగర్‌లో ద్వీపప్రాంతమైన చాకలిగట్టును పెద్దఎత్తున పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి ప్రణాళికలు కూడా రూపొందించారు.