చిరువ్యాపారులకు భరోసానిచ్చారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు. రోడ్లపై చిరువ్యాపారులు చేస్తూ.. పొట్ట నింపుకునే వారికి శాశ్వత నీడ కల్పించి ఏకంగా దుకాణాలనే ఏర్పాటు చేయించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ క్రాస్‌రోడ్డు వద్ద మంత్రి హరీశ్‌రావు కృషితో స్ట్రీట్ వెండర్స్ కాంప్లెక్స్‌ను నిర్మించారు.
ఆదర్శంగా సిద్దిపేట...
రాష్ట్రంలో ఎక్కువ స్ట్రీట్ వెండర్స్‌కు లబ్ది చేకూర్చడంలో సిద్దిపేట ఆదర్శంగా నిలిచింది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని స్వయంగా మంత్రి హరీశ్ రావు రేపు ప్రారంభించనున్నారు. దగ్గరుండి చిరు వ్యాపారులను దుకాణాల్లోకి అడుగు పెట్టించనున్నారు.
ఫుట్‌పాత్‌ల పక్కన విక్రయాలు జరిపే చిరువ్యాపారులు వానొచ్చినా... ఎండొచ్చినా వారికి ఆధారం ఉండదు. కష్టాల మధ్య జీవనం కొనసాగిస్తున్న వ్యాపారుల కోసం ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో ప్రయోగాత్మకంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు.
ప్రయోగాత్మకంగా...
రూ. 1.30 కోట్లతో పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద 40 దుకాణాలతో ప్రయోగాత్మకంగా నిర్మించారు. వివిధ ప్రాంతాలలో రోడ్లపై విక్రయాలు చేస్తున్న వీధి వ్యాపారాలను గుర్తించి వారికి దుకాణాలను డ్రాప్ పద్ధతిలో కేటాయించారు. తొలిదశలో 30 మందికి వీధి వ్యాపారులకు దుకాణాలు కేటాయించారు.
రాష్ట్రంలోనే ప్రయోజనాత్మకంగా వీధి వ్యాపారుల కోసం చేపట్టిన ప్రక్రియ సిద్దిపేటలో తొలి ఫలితం అందించనుంది. ప్రారంభానికి సిద్ధమైనప్పటికీ కరోనా, ఎన్నికల నేపథ్యంలో జాప్యం జరిగింది. అన్ని సౌకర్యాలు కలిగిన ఈ కాంప్లెక్స్ ఎట్టకేలకు రేపు ప్రారంభానికి సిద్ధమైంది.
ఇదీ చూడండి: పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్