ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లోని పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందుకొచ్చారు. తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లలోనే ప్రత్యేకంగా వీడియో పాఠాలు చిత్రీకరించి, ఆకర్షణీయమైన బొమ్మలు జోడించి, ఆటలు, పాటలతో పాఠాలను రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్, టీ-శాట్ ద్వారా తరగతులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు 1, 2 తరగతుల విద్యార్థులకూ ఆన్లైన్ పాఠాలు చెప్పాలని హుస్నాబాద్ ఎంఈవో అర్జున్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆకట్టుకునే పాఠాలు
హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పలువురు ఉపాధ్యాయులతో ఎంఈవో చర్చించి... 1, 2 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి 20మంది విషయ నిపుణులను ఎంపిక చేశారు. పిల్లల అభ్యసన సామర్థ్యాలకు తగినట్లుగా తెలుగు, గణితం, ఆంగ్లం సబ్జెక్టుల్లో 30 నిమిషాల నిడివితో వీడియో పాఠాలు రూపొందించారు. ఆటలు, పాటలు, మాటలతో ఆకట్టుకునేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.
జిల్లావ్యాప్తంగా...
తొలుత హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లోని విద్యార్థులకు మాత్రమే స్థానిక కేబుల్ నెట్వర్క్ ద్వారా పాఠాలు ప్రసారం చేయాలనుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారి రవి కాంతారావు దృష్టికి తీసుకువెళ్లగా... ఈ తరగతులను జిల్లావ్యాప్తంగా ప్రసారం చేయాలని ఆయన కోరారు. జిల్లా వ్యాప్తంగా నెట్వర్క్ కలిగి ఉన్న ఎస్సెస్సీ ఛానెల్ యాజమాన్యంతో చర్చించారు. అంతా అంగీకరించడంతో అక్టోబర్ 19 నుంచి ఎస్సెస్సీ కిడ్స్ ఛానల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి.
ఎంత మందికి లబ్ధి?
జిల్లాలో 1,150 ప్రాథమిక పాఠశాలలు, 230 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 8,284 మంది 1 వ తరగతి, 11,773 విద్యార్థులు 2 వ తరగతి చదువుతున్నారు. టీవీలో డిజిటల్ పాఠాల ద్వారా దాదాపు 20వేల మంది విద్యార్థులు జిల్లాలో ఆన్లైన్ తరగతులు ద్వారా విద్యను అభ్యసించే అవకాశం కలిగింది. ఆన్లైన్ తరగతుల ప్రసారాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు సామాజిక మాధ్యమాల ద్వారా చేరవేస్తూ, పాఠశాలకు దగ్గరగా ఉన్న ఇళ్లకు వెళ్లి విద్యార్థులు టీవీలో ఆన్లైన్ తరగతులు చూసేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
యూట్యూబ్ ఛానెల్లోనూ...
విద్యా సంవత్సరం వృథా కావొద్దనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మొదటి విడతగా అక్టోబర్ 19 నుంచి నవంబర్ 6 వరకు సరిపడా పాఠాలు రూపొందించి షెడ్యూల్ ఖరారు చేశామని తెలిపారు. ఎస్సెస్సీ కిడ్స్ ఛానెల్లో ప్రసారమైన ఈ ఆన్లైన్ డిజిటల్ పాఠాలు జిల్లా విద్యాశాఖ యూట్యూబ్ ఛానెల్ 'సమగ్ర శిక్ష సిద్దిపేట' లోనూ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
తల్లిదండ్రుల కృతజ్ఞతలు
టీవీ ద్వారా 1, 2 తరగతులకు ఆన్లైన్ తరగతులు ప్రసారం చేయడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తమ పిల్లల విద్యా సంవత్సరం వృథా కాకుండా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తుండడాన్ని అభినందించారు.