బతుకమ్మ, దసరా పండగ నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ సూచించారు. కాలనీల్లో అనుమానంగా సంచరించే వారి వివరాలను పోలీసులకు వెంటనే చేరవేయాలన్నారు. శివారు కాలనీల్లో తాళం వేసిన ఇళ్ల వద్ద అపరిచితులు తచ్చాడితే అప్రమత్తం కావాలని సూచించారు.
విలువైన వస్తువులు, సామగ్రి ఇంట్లో పెట్టి వెళ్లకూడదని... ఇరుగు, పొరుగు వారికి, సమీప పోలీసు ఠాణాల్లోనూ వెళ్లే ముందు సమాచారం ఇవ్వాలన్నారు. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని రావడం ఉత్తమమని పేర్కొన్నారు. జిల్లాలో గస్తీ ముమ్మరం చేశామని, పెట్రోలింగ్ కూడా పెంచామన్నారు. ప్రయాణాలు చేసే క్రమంలో వాహనాలు, బస్సులు, రద్దీ ప్రాంతాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసులను సంప్రదించేందుకు డయల్-100 లేదా పోలీసు కంట్రోల్ రూం నంబరు 83339 98699, కమిషనరేట్ వాట్సాప్ నంబరు 79011 00100 సంప్రదించాలని కోరారు.
ఇదీ చూడండి: దగ్గర పడుతున్న గడువు... ధరణి సాగేనా సాఫీగా..?