సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు బ్యాగరి నర్సింహులు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. పెద్ద దిక్కు కోల్పోయిన ఆ దళిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కు అందించి.. ప్రభుత్వం వారికి కేటాయించిన ఒకటిన్నర ఎకరం భూమి పట్టా అందజేశారు. అనంతరం వారిని ఆ భూమి దగ్గరికి తీసుకెళ్లి సరిహద్దులు చూపించారు.
ఎస్సీ, ఎస్టీలకు అన్ని విషయాల్లో కమిషన్ అండగా ఉంటుందని, ప్రతి దళిత, గిరిజన కుటుంబానికి అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు. వేధింపులు తాళలేక, పలు రకాల సమస్యలతో దళితులు, గిరిజనులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ధైర్యంగా ఎదిరించడం, బతకడం నేర్చుకోవాలని.. కేసీఆర్ సారథ్యంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ బాధితులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. రైతు బ్యాగరి నర్సింహులు మరణానికి సంతాపం వ్యక్తం చేసి.. వారి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ ప్రకారం వారికి ఎకరం భూమితో పాటు కమిషన్ చొరవతో మరో 20 గుంటల భూమి అదనంగా ఇచ్చామని తెలిపారు. ఈ భూమిలో కమిషన్ ప్రత్యేక చొరవ తీసుకొని బోరు బావి తవ్వించి విద్యుత్ మోటార్లు బిగించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి, ఏసీపీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆన్‌లైన్ అగాధంలో చదువులు- గాడిన పడేనా!